'దాడులను సహించం.. కార్యకర్తలను కాపాడుకుంటాం' - chandrababu serious on Political attacks on tdp cader news
కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన సాగుతోంది. వైకాపా బాధితుల సమావేశంలో పాల్గొన్న ఆయన... కార్యకర్తల సమస్యలు విన్నారు. బాధితులకు అండగా ఉంటానని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. రాజకీయ దాడులను సహించేదిలేదని ప్రత్యర్థులను హెచ్చరించారు.
కర్నూలులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. దివ్యాంగులు, వైకాపా బాధితుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడం అందరి బాధ్యత అభిప్రాయపడ్డారు. విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తీసిపోరని వ్యాఖ్యానించారు. వారికి అండగా ఉంటామని...అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
కార్యకర్తలపై అట్రాసిటీ కేసులా..?
వైకాపా అధికారంలోకి వచ్చాక...చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ తప్పూ చేయని తెదేపా కార్యకర్తలు, నాయకులపై ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ సమాజం కోసం పని చేస్తోందన్నారు.
నాపైనే దాడికి యత్నించారు..!
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలపై 640 కేసులు నమోదయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉండేందుకు 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపునిస్తే తనని ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పర్యటనకు వెళ్లిన తమపై దాడులకు దిగేలా ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. కాన్వాయ్‌పై దాడికి గల కారణాలను ప్రశ్నిస్తే పోలీసులు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారని దుయ్యబట్టారు.
వివేకా హత్య కేసు ఏమైంది..!
ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. సహజ మరణంగా చూపేందుకు కొందరు ప్రయత్నించారని.. కానీ తమ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టిన కారణంగానే హత్య అని తేలిందన్నారు. వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరనేది తేల్చని ప్రభుత్వం.. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను విచారణ పేరుతో వేధిస్తోందని మండిపడ్డారు. తెదేపాపై కక్ష సాధింపు చర్యలకు దిగితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: