కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ కార్యక్రమం కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలో అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రమే బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. కిరాణం, మెడికల్ షాపులు తప్ప అన్ని వ్యాపార సముదాయాలు మూసివేశారు. మెడికల్ షాపుల వద్ద దూరంగా ఉండి మందులు తీసుకోవాలని నోటీసు అంటించారు. నగరంలో కొత్తగా రైతు బజార్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
నంద్యాల..
నంద్యాలలో బ్యాంక్ నియామక పరీక్షల శిక్షణతీసుకుంటున్న తెలంగాణ విద్యార్థులు తిరిగి నంద్యాలకు వచ్చారు. వారి రాష్ట్రానికి వెళ్లేందుకు సరిహద్దులో అనుమతిని ఇవ్వనందున వసతిగృహానికి చేరుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం లేని కారణంగా ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు తెలిపారు. తిరిగి వచ్చిన విద్యార్థులకు అధికారులు భోజన వసతి కల్పించారు. మరోవైపు.. పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతుంది. రహదారిపై ఎవరినీ తిరగకుండా చర్యలు చేపట్టారు. మాంసం అమ్మకాలకు కొన్ని గంటలు అనుమతి ఇచ్చారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వార్డు నాయకులు పేదలకు ఆహారాన్ని అందించారు. అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
కోడుమూరులో..
కర్నూలు జిల్లా కోడుమూరులో వైద్య సిబ్బంది కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంత బజార్ నుంచి మెయిన్ బజార్ మీదుగా సిబ్బందితో కలిసి ఆటోలో ప్రచారం చేశారు. సామాజిక దూరం పాటించాలంటూ, గుంపులుగా తిరగకూడదని తెలిపారు. పని లేక పోయినా అనవసరంగా బయట తిరగకుండా ఇంట్లోనే గడపాలని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. విదేశాల నుంచైనా, ఇతర ప్రాంతాల నుంచైనా వస్తే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆదోనిలో తెలంగాణవాసులు..
కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు పోలీసులు సూచించారు. ఈ కారణంగా.. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలో ప్రజలు స్వీయ నిర్బంధం పాటించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు ఆదోనిలో వివాహాని వచ్చి చిక్కుకున్నారు. తమ రాష్ట్రానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: