గత విద్యా సంవత్సరంలో టీశాట్, దూరదర్శన్‌లో బోధన ప్రారంభించే ముందు విద్యార్థుల వద్ద సౌకర్యాలపై తెలంగాణ విద్యాశాఖాధికారులు సర్వే చేపట్టారు. ఈసారి సర్వే చేయకుండానే పాత డాటానే వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు డిజిటల్ పాఠాల(Online Classes)ను వింటున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులతో బృందాలు ఏర్పాటు చేయాలి. అలాకాకుండా నేరుగా టీవీల్లో, టీశాట్ ద్వారా ప్రసారమయ్యే పాఠాలు వినాలని విద్యార్థులకు చెప్పినా, ఏ మేరకు చేరుతుందనేది అనుమానమే.
సాధనాలు లేక సమస్యలు
గత విద్యా సంవత్సరంలోనూ విద్యాశాఖ 3-10 తరగతి వరకు డిజిటల్ పాఠాలు(Online Classes) బోధించింది. సరైన సాధనాలు లేక వేలాది మంది విద్యార్థులకు బోధన అందలేదు. తొలుత ఆయా విద్యార్థులను సమీపంలో టీవీ లేదా చరవాణి సౌకర్యం ఉన్న విద్యార్థుల వద్దకు పంపించి పాఠాలు వినేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు. రానురానూ పర్యవేక్షణ పూర్తిగా కనుమరుగైంది. గత విద్యా సంవత్సరంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 2,68,949 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలామంది డిజిటల్ బోధనకు దూరమయ్యారు.
- రంగారెడ్డి జిల్లాలో 44,723 మంది విద్యార్థుల వద్ద చరవాణులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో పాఠాలు వినలేకపోయారు.
- హైదరాబాద్ జిల్లాలో 3,326 మందికి ఎలాంటి డిజిటల్ పరికరాలు లేవని గుర్తించారు.
- మేడ్చల్ జిల్లాలో 9,151 మందికి చరవాణి లేదా టీవీ లేదని గుర్తించారు. సమీపంలోని విద్యార్థులతో అనుసంధానించినా, పర్యవేక్షణ లేక పాఠాలు వినలేకపోయారు.
ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ
ఈసారి డిజిటల్ పాఠాలు(Online Classes) విద్యార్థులందరికీ చేరేలా గట్టి చర్యలు తీసుకుంటాం. చరవాణి, టీవీ లేని విద్యార్థులను గుర్తించి సమీపంలోని విద్యార్థుల ఇళ్లలో లేదా పంచాయతీ కార్యాలయాల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తాం. ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలు వేసి పర్యవేక్షిస్తాం. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల హాజరు తీసుకునేలా చూస్తాం. డిజిటల్ పాఠాలు వినేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. -సుశీంద్రరావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
ఇదీ చదవండి: