Gold Medalists: మనిషికి ఎలాంటి అనారోగ్యం తలెత్తినా అతను ఎదురుచూసేది వైద్యుడి కోసమే. వైద్యవృత్తి ముందర రాజైనా, పేదైనా అందరూ సమానులే. సమాజంలో అంతటి గుర్తింపు పొందిన వైద్యవిద్యను అభ్యసించేందుకు ఎంతో మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తుంటారు. కష్టమైనా ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తుంటారు. అయితే ఇష్టంగా చదివితే ఎంబీబీఎస్ కోర్సులోనూ బంగారు పతకాలు సులువుగా సాధించవచ్చని నిరూపిస్తున్నారు కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో ఒక్కొక్కరు రెండేసి, మూడేసి పతకాలతో సత్తా చాటారు.
బైపీసీ పూర్తి చేసి 2016లో కర్నూలు మెడికల్ కళాశాలలో చేరి.. ఎంబీబీఎస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఈ విద్యార్థులు. తమ చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకుగానూ... పతకాలు సాధించారు. ఈ మధ్యనే జరిగిన కేఎంసీ(KMC) స్నాతకోత్సవంలో బంగారు పతకాలని సొంతం చేసుకున్నారు
నెల్లూరు నగరానికి చెందిన... జ్యోత్స్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో వైద్యులెవరూ లేరు. కష్టపడి చదివి మెడిసిన్‌లో 479వ ర్యాంకు సాధించి కర్నూలు మెడికల్ కాలేజ్-కేఎంసీ(KMC) లో చేరింది. ఎంతో ఇష్టంతో వైద్యవిద్య అభ్యసించి.. ఏకంగా 5 బంగారు పతకాలు పతకాలు సాధించి కర్నూలు వైద్య కళాశాల నుంచి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది.
తన ఇంట్లో చాలా మంది వైద్యులు ఉండటంతో.. ఈ వృత్తిలోనే రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది సాయి ప్రేరణ. మెడిసిన్‌లో మంచి ర్యాంకు సాధించి కేఎంసీ(KMC)లో చేరింది. వృత్తిపట్ల అంకితభావంతో పేద రోగులకు సేవ చేస్తూ... తన చదువు కొనసాగించింది. ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో 2 పసిడి పతకాలు సాధించింది.
పులివెందుల ప్రాంతానికి చెందిన దత్త భవతేజారెడ్డి.. కొవిడ్ సమయంలో హౌస్ సర్జన్‌గా... ఎంతోమంది కరోనా రోగులకు సేవ చేశాడు. అలా.. గైనిక్, ఈఎన్టీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రెండు బంగారు పతకాలు సాధించాడు.
కర్నూలుకు చెందిన సంజన తల్లిదండ్రులు వైద్యులు కావటంతో... తాను కూడా వైద్య వృత్తిని ఎంచుకుంది. కొవిడ్ సమయంలో గైనిక్ విభాగంలో విధులు నిర్వహించింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ విభాగాల్లో 3 బంగారు పతకాలు సాధించింది.
రాజంపేటకు చెందిన భరత్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి ప్రోత్సాహంతో... వైద్య విద్యను ఎంచుకున్నాడు. పీడియాట్రిక్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి... బంగారు పతకం సాధించాడు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన అమృత తన తండ్రి ప్రోత్సాహంతో ఎంబీబీఎస్‌లో చేరింది. బయో కెమిస్ట్రీ విభాగంలో బంగారు పతకం సాధించింది. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అర్ఫియా కౌసర్ పేద కుటుంబం నుంచి వచ్చింది. మైక్రోబయాలజీ విభాగంలో అర్ఫియా బంగారు పతకం సాధించింది. జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇష్టంగా చదివితే ఎంబీబీఎస్ కోర్సులోనూ బంగారు పతకాలు సులువుగా సాధించవచ్చని నిరూపిస్తున్నారు.. కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థులు.
ఇదీ చదవండి: Nara Lokesh: రాష్ట్రంలో పరిస్థితి బిహార్‌ను మించిపోయింది.. రేపల్లె అత్యాచార ఘటనను ఖండించిన తెదేపా