కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహకంలోని గ్రామాల ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే గడుపుతున్నారు. వరద కాస్త తగ్గుముఖం పట్టినా పొలాలు నీటిలోనే నానుతున్నాయి. తోట్లవల్లూరు, చల్లపల్లి మండలాలతో పాటు నడకుదురు రెవిన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో పసుపు, చెరకు, కంద, మినుము , పంటలు వరదకు నీటమునిగాయి. చేతికొచ్చిన పంట పాడైపోవడంతో అన్నదాతలు అవేదన చెందుతున్నారు. ఇళ్లు కూడా పూర్తిగా మునిగిపోయాయని, ఎక్కడ ఉండాలో తెలియట్లేదని అంటున్నారు.
గతేడాది కూడా ఇలానే నష్టపోయామని, అప్పుడూ పరిహారం ఇవ్వలేదని, ఈ సారైనా తమను ఆదుకోవాలని లేకపోతే నిండా మునుగుతామని రైతులు వాపోతున్నారు.
అనంతపురం జిల్లా శింగనమల మండలం చక్రాయపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. వర్షానికి తడిచిన వేరుసెనగ పంటను పరిశీలించి రైతులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఎకరానికి 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గూడూరు, పగిడ్యాల, కోవెలకుంట్ల, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి తదితర మండలాల్లో వాన పడింది. తుగ్గలి మండలం ఆర్.ఎస్. పెండేకల్ వాగు ఉద్ధృతికి కూలీలతో వెళుతున్న ఆటో కొట్టుకుపోయింది. స్థానికులు ఆటోలోని వారిని సురక్షితంగా కాపాడారు. దేవనకొండ - కొత్తపేట రహదారిలో తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోయింది.
ఇదీ చదవండి : అముదార్లంకను ముంచిన వరద.. అవస్థల్లో ప్రజలు