Farmers Suicide: నేలతల్లిని నమ్ముకుని బతుకులీడుస్తున్న రైతులకు అప్పుల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. పంట చేతికి రాని స్థితి కొందరిదైతే.. గిట్టుబాటు ధర రాని పరిస్థితి మరికొందరిది.. చేసిన అప్పులు తీర్చలేక.. భార్యబిడ్డలను పోషించలేక మరణమే శరణం అనుకుంటున్నారు అన్నదాతలు.. ఒక్క రోజు వ్యవధిలో వేర్వేరు జిల్లాల్లో ఐదుగురు అన్నదాతలు అప్పుల బాధను తాళలేక మృత్యు ఒడిని చేరారు.
Farmers Suicide: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన మెడబోయిన రామకృష్ణ (39) తనకున్న రెండు ఎకరాల భూమితో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగు చేశారు. వరుసగా రెండేళ్లు దిగుబడులు లేక రూ.10 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. రుణం తీర్చే దారి కానరాక సోమవారం పొలం వద్ద పురుగుల మందు తాగారు. చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు.
Farmers Suicide: కర్నూలు జిల్లా కౌతాళం మండలం మెళిగనూరులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక జగదీశ్ అనే యువ రైతు స్వంత వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకృతి వైపరీత్యం వల్ల పంటకు వైరస్ సోకడంతో పంట దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల వాళ్ల వేధింపుల భరించలేక... మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Farmers Suicide: ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లిన యువ రైతు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొదిలి మండలం కాటూరివారి పాలెం గ్రామానికి చెందిన పాలగిరి రామ్మూర్తి అనే యువరైతు ప్రతి ఏడాది కౌలుకు తీసుకుని పెద్దఎత్తున పొలాలు సాగుచేస్తూ వరుస ఆర్థిక నష్టంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Farmers Suicide: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి(55) తనకున్న తొమ్మిది ఎకరాలకు తోడుగా 40 ఎకరాల పొలాన్ని ఎకరా రూ.22 వేల చొప్పున కౌలుకు తీసుకొన్నారు. ఐదేళ్లుగా శనగపంట సాగు చేశారు. పెట్టుబడి కోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చలేక మనస్తాపానికి గురై విషపు గుళికలను మింగారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరుకు చెందిన ఉప్పర తిక్కయ్య(62) తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకొన్నారు. సాగులో నష్టం వాటిల్లింది. అప్పులు చెల్లించే మార్గంలేక ఆదివారం అర్ధరాత్రి గుళికలు మింగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
ఇదీ చదవండి: Conflict between Womens: స్థల వివాదం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళలు