Wall of Service at Kakinada: కాకినాడ రామారావుపేటలోని లయన్స్ క్లబ్‌లో ఈ ఏడాది మార్చిలో 'వాల్ ఆఫ్ సర్వీస్' ప్రారంభమైంది. ఇందులో లయన్స్ క్లబ్ కాకినాడ, కాకినాడ ఎలైట్, కాకినాడ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ డైమండ్స్ భాగస్వామ్యమయ్యాయి. ఇళ్లలో వాడకుండా వదిలేసిన వస్తువుల్ని సంస్థ సభ్యులు తెచ్చి ప్రదర్శనగా ఉంచారు. టీవీలు, ఇస్త్రీ పెట్టెలు, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ సామగ్రి, బూట్లు, దుస్తులు, సూట్ కేసులు, పాత పుస్తకాలు ఇలా రకాల రకాల వస్తువుల్ని ర్యాకుల్లో అమర్చారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఈ వస్తువుల్ని కావాల్సిన వారు వచ్చి తీసుకెళ్తుంటారు. వస్తువులు దుర్వినియోగం కాకుండా... సేవలు అందరికీ అందాలనే ఉద్దేశంతో అవసరమైన వారికి మాత్రమే అందించేలా సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
'ప్రతీ ఇంట్లో కూడా వాడని వస్తువులు...ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. అలాంటి వాటిని ఇక్కడ పెట్టి, వారికి కావల్సినవి, అవసరమైనవి ఇక్కడ నుంచి తీసుకువెళ్లొచ్చు.వస్తువులను అవసరమైన వారికి ఉచితంగానే అందిస్తున్నాం. ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. వస్తువులను తీసుకున్న వారి పూర్తి వివరాలను పుస్తకంలో రాసుకుంటున్నాం. దీని ద్వారా ఒక్కరే ఎక్కువ ప్రయోజనాలు కాకుండా...ఎక్కువ మందికి వస్తువులు ఉపయోగపడే విధంగా పర్యవేక్షిస్తున్నాం. ప్రతీ ఇంట్లో కూడా వాడని వస్తువులు...ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. అలాంటి వాటిని ఇక్కడ పెట్టి, వారికి కావల్సినవి, అవసరమైనవి ఇక్కడ నుంచి తీసుకువెళ్లొచ్చు.' -బాలకృష్ణ, ఛైర్మన్, వాల్ ఆఫ్ సర్వీస్.
'ఇంట్లో వాడని వస్తువులను ఎవరైనా ఇక్కడ పెట్టొచ్చు. అలాగే అవి అవసరమైన వాటిని ఎవరైనా తీసుకెళ్లవచ్చు. ఇందులో తరతమ, పేద ధనిక భేదాలు లేవు.' -జగన్నాథరావు, లయన్స్ క్లబ్ సభ్యుడు
వాల్ ఆఫ్ సర్వీస్ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న నగరవాసులు ఇళ్లల్లో వాడకుండా మూలన వేసిన వస్తువులను తీసుకొచ్చి అందిస్తున్నారు. ఎంతోమంది సామాన్యులు, నిరుపేదలు లయన్స్ క్లబ్ వద్దకు వచ్చి... ఉపయోగపడే వస్తువులను తీసుకెళ్తున్నారు. ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా వస్తువులను ఉచితంగా అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'లయన్స్ క్లబ్ వారు నాకు ఒనిడా టీవీ,ఏసీని ఉచితంగా అందించారు. ఎలాంటి డబ్బు నాదగ్గర నుంచి తీసుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు. ఈరోజుల్లో ఇలాంటి పని చేయడం నిజంగా గొప్పవిషయం.' -చిన్నా, కాకినాడ
' అందరికీ ఉచితంగానే ఇక్కడ సామాన్లు అందిస్తున్నారు. బయట అధిక ధరలుండి కొనలేని వారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.' -కుసుమ, కాకినాడ
'టీవీ వంటి ఖరీదైన వస్తువులను ఇక్కడ ఉచితంగా..మాలాంటి కొనే స్థోమత లేని వారికి ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి చీరలు కూడా తీసుకున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇలా ఉచితంగా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది.' -సత్యవేణి, కాకినాడ
ఇంట్లో పనికిరాని వస్తువులను బయట పారేయడం వల్ల పర్యావరణానికి కూడా అనర్థమని వస్తువులను వాల్ ఆఫ్ సర్వీస్‌కు ఇచ్చి.. ప్రకృతిని కాపాడాలని లయన్స్ క్లబ్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి :
- అమ్మ అబద్ధం చెప్పింది.. అల్లుడిని చంపింది వాళ్లే..!
- WATER: కోట్లు ఖర్చు పెట్టినా.. తీరని దాహార్తి
- 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' విజేతగా బిందు మాధవి..