Handloom Weavers Problems: ప్రపంచ ప్రఖ్యాతి పట్టుచీరలు నేసే రాష్ట్ర చేనేతలు సంక్షోభంలో చిక్కుకున్నారు. 6 నెలల కిందటి వరకు రూ.3 నుంచి 4 వేలు మధ్యనున్న కిలో ముడిపట్టు ధర దాదాపు రెట్టింపై.. ఆరున్నర వేల నుంచి ఏడున్నర వేల రూపాయల మధ్యకు చేరింది. కరోనాతో ఇప్పటికే నష్టపోయిన చేనేతలకు ఇది మరింత గుదిబండగా మారింది. కొనుగోలుదారులు ముందుకురారనే ఆలోచనతో పెరిగిన ధరకు అనుగుణంగా చీర ధరలను పెంచలేక మాస్టర్ వీవర్స్ ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. మరికొందరు గిట్టుబాటుగాక మగ్గాలను మూసేస్తున్నారు. దీనివల్ల కార్మికులకు ఉపాథి కరవవుతోంది.
లాక్‌డౌన్ తర్వాత ముడిసరుకు ధరలు అమాంతంగా పెరగడం, మల్బరీ సాగు తగ్గడంతో ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, అన్నమయ్య జిల్లా మదనపల్లె, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, బాపట్ల జిల్లా చీరాల, తిరుపతి జిల్లా వెంకటగిరి, కాకినాడ జిల్లా పెద్దాపురం, ఉప్పాడ, గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతాల్లో పట్టుచీరలు ఎక్కువగా నేస్తారు. రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ భాగం ముడిపట్టు మార్కెటింగ్ కర్ణాటక కేంద్రంగానే సాగుతోంది. గతంలో అక్కడ పట్టు పెంపకం చేపట్టే రైతులు యార్న్‌ను ఇక్కడికి తెచ్చి చేనేతలకు నేరుగా అమ్మేవారు. సాగు ఆధారంగా ధరల్లో అప్పుడప్పుడు కొంత పెరుగుదల ఉండేది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఓ ప్రైవేటు సంస్థ కర్ణాటక రైతుల పొలాల వద్దకే వెళ్లి యార్న్ కొంటోంది. పైగా గతంలో కంటే అధిక ధరను వారికి చెల్లిస్తోంది. ఇది లాభదాయకంగా మారడంతో రాష్ట్ర చేనేతలకు యార్న్ అమ్మకాలను అక్కడి రైతులు నిలిపివేశారు. ఇది ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ధర్మవరం, మదనపల్లె మాస్టర్ వీవర్స్ చెబుతున్నారు.
పెరిగిన ముడిసరుకు ధరలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 వేల 500 మగ్గాలు మూతపడ్డాయి. మదనపల్లెలో 10 వేల మగ్గాలుండగా దాదాపు 4 వేలు మూతపడ్డాయి. ధర్మవరంలో 20 వేలలో 3వేలు...ఎమ్మిగనూరు చుట్టుపక్కల గ్రామాల్లో 8 వేల మగ్గాలకు 3 వందలు, ఉప్పాడలో వెయ్యి మగ్గాలకు 2 వందలకు పైగా మూతపడ్డాయి. వెంకటగిరి ప్రాంతంలో 2వేల 4 వందల మగ్గాలుండగా...పదిరోజుల్లోనే 2 వందలు మూతపడ్డాయి. చీరాల, మంగళగిరిలోనూ ఇదే పరిస్థితి. ఉపాధి కోల్పోయిన చాలా మంది తాపీ పనులకు, పరిశ్రమల్లో, మార్కెట్లలో కూలీలకు వెళ్తున్నారు. మరికొందరు మట్టిపనులకు పోతున్నారు.
గతంలో మంచిపట్టు చీర నేస్తే కార్మికుడి కుటుంబానికి వారానికి 3 వేల వరకు దక్కేది. ఇప్పుడు 15 వందలు కూడా రావడం లేదని కార్మికులు వాపోతున్నారు. యార్న్ ధర పెరిగిందంటూ మాస్టర్ వీవర్స్ కూలీ తగ్గిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. మరికొందరు గిట్టుబాటు కావడం లేదని చేనేత మగ్గాలను తగ్గించి పవర్ లూమ్‌ల వైపు మళ్లుతున్నారు. ఇది కార్మికుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కరోనా ఇబ్బందులను అధిగమించే సమయంలో పెరిగిన ముడిసరుకు ధరలు చేనేతను కుంగదీశాయని నేతన్నలు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలు నియంత్రిస్తేనే చేనేత మనుగడ సాధ్యమంటున్నారు. 40ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని తక్కువ ధరకు ముడిసరుకు అందించిందని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేతను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పథకం కింద డబ్బులిస్తామంటున్నా.. అవి అర్హులైన వారికి దక్కడం లేదని కార్మికులు వాపోతున్నారు.
ఇదీ చదవండి : APSRTC CHARGES HIKE :ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు