తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని అతిక్రమిస్తూ ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన భవన నిర్మాణ కార్మికుల భవనం, వ్యాయామశాలను 44వ డివిజన్‌లో ప్రారంభించారు. దీనికి మేయర్ సుంకర పావని, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్వనిర్వాహక ఇంజినీరు సత్యకుమారి, డీఈ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.
దీనిపై ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో సీహెచ్.సత్తిబాబును వివరణ కోరగా కాకినాడలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని చెప్పారు. దీనిపై నివేదిక కోరతామన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను వివరణ కోరగా, తాను నగరంలో లేనని, ఈ విషయం తనకు తెలియదని చెప్పారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నాగనరసింహారావును వివరణ కోరగా తాను ఆ కార్యక్రమానికి వెళ్లలేదని చెప్పారు.
ఇదీ చదవండి: తెరపైకి పుర పోరు... ఆగిన చోటు నుంచే చేపట్టే యోచన