కడప జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయటంతో... ఫ్యాక్టరీ ఏర్పాటుపై కదలిక వచ్చింది. పునర్విభజన చట్టం ప్రకారం కడపలో కేంద్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ... అధ్యయనం పేరిట ఎటూ తేల్చని నేపథ్యంలో... 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షల మూలధన పెట్టుబడితో 2013 కంపెనీల చట్టం ప్రకారం 'ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్' పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. దీని కోసం 2019-20 బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
ముడిఇనుము ఎలా..?
అయితే కర్మాగారానికి ముడిఇనుము ఎక్కడి నుంచి తీసుకురావాలన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి. పొరుగున ఉన్న కర్ణాటకలోని గనుల్లో ముడిఇనుము తవ్వకాలు, ఎగుమతులపై సుప్రీం కోర్టు నిషేధం ఉంది. ఫలితంగా ముడిఇనుము సరఫరాపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇనుప ఖనిజం తీసుకొచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి కడపకు ముడి ఇనుము సరఫరా చేయడం నష్టదాయకం అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రవాణా ఛార్జీలు తడిసి మోపెడయ్యే అవకాశమున్నందున ఉత్పత్తి ఖర్చూ పెరిగొచ్చని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. అనంతపురం జిల్లాలో ముడి ఇనుము గనులు ఉన్నా.. వాటి నాణ్యత విషయంలో ప్రభుత్వం సంతృప్తిగా లేదని తెలుస్తోంది.
డిసెంబర్ 26న శంకుస్థాపన...
3 వేల 295 ఎకరాల్లో కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికోసం ప్రాథమికంగా రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ జన్మదినం... డిసెంబరు 26న ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి మెకాన్ సంస్థ ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రాథమికంగా రూ.10 వేల కోట్ల అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఉక్కు కర్మాగారానికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఏడేళ్లపాటు ఐజీఎస్టీ రిఫండ్‌తో పాటు మొదటి 15 ఏళ్లలో... పదేళ్ల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు.. యంత్రాలు, ఇతర ముడిసరకు దిగుమతులపై దిగుమతి సుంకం మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఇవీ చదవండి..