పది మంది చుట్టుముట్టినా ఏ మాత్రం బెదరకుండా చేతిలో ఉన్న కర్రతో ప్రతిఘటిస్తూ వారిపై తిరగబడవచ్చు.. పది నిమిషాల్లో వారందరినీ మట్టి కరిపించవచ్చు. అందుకు ఏకైక సాధన కర్రసాము. అమ్మాయిల ఆత్మరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాచీన కళ అయిన కర్రసామును ఓ యువకుడు అందరికీ నేర్పుతున్నాడు.
చిన్నారులే అధికం..
కనుమరుగౌతున్న ఈ విద్యను భావితరలకు నేర్పుతూ కళకు ప్రాణం పోస్తున్నాడు కడపకు చెందిన జయ చంద్ర. డిగ్రీ చదువుతున్న సమయంలో కర్రసాముపై ఆసక్తితో తన తండ్రి సహకారంతో నేర్చుకున్నాడు. ఈ కళను మరికొంత మందికి చేరువ చేయాలనే సంకల్పంతో.. కడప సీఎస్ఐ పాఠశాల ఆవరణంలో ఆసక్తి కలిగిన కొంత మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడు. చిన్న పిల్లల నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారందరికీ కర్రసాము నేర్పిస్తున్నాడు. అయితే ఈ కళను ఎక్కువ మంది చిన్నారులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు.
ఆకతాయిలను అడ్డుకునేందుకు
ప్రస్తుత రోజుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ కర్ర సాము ఎంతో ఉపయోగపడుతోందని చెబుతున్నాడు జయచంద్ర. కర్ర చేతిలో లేకపోయిన ఆకతాయిల నుంచి తమను తాము ఎదుర్కొనేలా కూడా మహిళలకు శిక్షణ ఇస్తున్నాడు.
ఆత్మరక్షణకు..
కర్రసాము ప్రాచీన కళ అయినప్పటికీ ప్రస్తుత రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు కర్రసాము నేర్చు కోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుత రోజుల్లో మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఈ కర్ర సాము ఎంతో ఉపయోగపడుతోంది. ప్రభుత్వం కూడా కర్రసామును ప్రోత్సహించాలి. -మహేష్ కుమార్, కడప అదనపు ఎస్పీ,
ప్రతి పాఠశాలకు అందించటానికి సిద్ధం..
డిగ్రీ చదివేటప్పుడు కర్రసాము పట్ల ఆసక్తి ఉండేది. మా తండ్రి సహకారంతో ఈ విద్యను నేర్చుకున్నాను. ప్రస్తుతం ఈ కళను కొంత మంది విద్యార్థులకు నేర్పుతున్నాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రతి పాఠశాలకు వెళ్లి బోధిస్తాను. పిల్లలు.. ముఖ్యంగా మహిళలు తమని తాము రక్షించుకునేలా శిక్షణ అందిస్తాను. - జయచంద్ర, కర్రసాము మాస్టర్, కడప
కర్రసాము అనేది ఒక మహిళలకే కాదు అబ్బాయిలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆత్మరక్షణ కోసం కర్రసాము.. రక్షణ కవచంలా పనిచేస్తుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండీ.. కర్రసాముతో అదరగొట్టిన పవన్ తనయుడు అకీరా