Sarpanches: ‘వాలంటీర్లకు ఉన్న అధికారం సర్పంచులకు లేదు, ఇదీ చాలా అవమానకరం’ అని సర్పంచుల సంఘం వైయస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు శివచంద్రారెడ్డి అన్నారు. కడప నగరంలోని జడ్పీ కార్యాలయ డీపీఆర్‌సీ భవన్‌లో శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల సర్పంచులు గురువారం సమావేశమయ్యారు. సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తోందని... అందులో సర్పంచులకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిధుల లేమితో గ్రామాల్లో పనులు చేపట్టలేకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు సమస్యలు చెబుతున్నారన్నారు. నిధులు లేకుండా సర్పంచులు సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని పంచాయతీలకు త్వరగా నిధులు వచ్చేలా చూడాలని శివచంద్రారెడ్డి కోరారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని త్వరలో కలిసి సమస్యలను తెలియజేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో సర్పంచులదే కీలకపాత్రని.. ఆ వ్యవస్థకు నిధులిచ్చి బలోపేతం చేయాలని శివచంద్రారెడ్డి కోరారు.
గ్రామాల్లో ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పంచాయతీలకు వారం, పదిరోజుల్లో నిధులు వస్తాయన్నారు. సమావేశంలో సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తయ్య, కోశాధికారి కొండయ్య, సర్పంచులు శశికాంత్‌రెడ్డి, శివరామిరెడ్డి, నాగిరెడ్డి, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: