దేశంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా 15 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేస్తే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు తీర్మానం చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం భాజపాతో జత కట్టి రాష్ట్ర ముస్లింలను మోసం చేస్తోందని తీవ్రంగా ఆక్షేపించారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏకు వ్యతిరేకంగా కడప మున్సిపల్ మైదానంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభకు భారీగా ముస్లింలు తరలివచ్చారు. మాట తప్పం, మడం తిప్పం అనే మాటలు రాజశేఖర్ రెడ్డితోనే పోయాయని... రాష్ట్రంలో జగన్ అన్నీ మోసాలే చేస్తున్నారని విమర్శించారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్పీఆర్లోని కొన్ని ప్రశ్నలు మాత్రం మార్పు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసే విధంగా మంత్రివర్గంలో తీర్మానం చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
వారికి పదవిలో ఉండే అర్హత లేదు
ప్రజల మధ్య చిచ్చు పెట్టి దేశ విచ్ఛిన్నానికి ప్రధాన మోదీ, అమిత్ షా కారకులవుతున్నారని సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శలు డి.రాజా, సీతారాం ఏచూరి అన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సీఏఏ చట్టాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించామని డి.రాజా అన్నారు. కానీ ఈ చట్టం ఒక్క ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదని... దళితులు, మైనారిటీలందరిపై ప్రభావం చూపుతుందనే విషయం భారతీయులంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. దేశంలో కక్షలు పెంచుతున్న మోదీ, అమిత్ షాకు పదివిలో ఉండే అర్హత లేదని సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
'నాకే జనన ధ్రువీకరణ పత్రం లేదు... నా తండ్రిది ఎక్కడి నుంచి తీసుకురావాలి?'