కడప మేకలదొడ్డి వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది..
దాదాపు పదేళ్ల నుంచి ఖాజా అనే వ్యక్తి మేకలదొడ్డి వీధిలో నివసిస్తున్నాడు. ఖాజా తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి భార్యాపిల్లలతో పాటు ఖాజా బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని అత్తగారింట్లో దింపి.. ఖాజా ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్ లీకవుతూ ఉంది.. ఇంట్లో ఉన్న ఖాజా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించలేదు.. ఇంటికి వచ్చిన ఖాజా కూడా ఈ విషయాన్ని పసిగట్టగా.. వంట చేసేందుకు స్టవ్ వెలిగించాడు. అంతే.. ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ పేలింది. భారీ శబ్ధంతో అక్కడకు చేరుకున్న స్థానికులు.. తీవ్రగాయాలైన ఖాజాతో పాటు ఆయన తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖాజా ఈరోజు ఉదయం మృతి చెందారు. అతని తండ్రి ముస్తఫా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో సామాగ్రి కాలిబూడిదయ్యింది. సుమారు రూ.70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదీ చదవండి :