RTC Bus Workshop : ఆర్టీసీ ప్రయాణాన్ని సుఖమయంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాతబడిన ఆర్టీసీ బస్సులకు కొత్త రూపు తెచ్చేందుకు పనులు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం పాత ఆర్టీసీ బస్సుల్లో సీట్లు, అద్దాలను అధికారులు మారుస్తున్నారు. నెలకు 30 బస్సులకు ఫేస్ లిప్టింగ్ పనులు చేస్తూ.. పాత బస్సులకు అన్ని విధాలా సౌకర్యాలు సమకూరుస్తున్నారు.
కడప పారిశ్రామికవాడలో 25 ఎకరాల్లో ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్ షాపు పరిధిలో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సుల మరమ్మతులు ఇక్కడ చేస్తున్నారు. ఈ జోనల్ వర్క్ షాపులో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఇంజిన్లు, బస్సు సీట్లు, అద్దాలు మొదలైనవాటిని మార్చేస్తున్నారు. కొత్త బస్సు తరహాలో చక్కని రంగులు అద్ది అందంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు అంటున్నారు.
"జోనల్ వర్క్ షాపులో దాదాపు నెలకు 30 పల్లె వెలుగు బస్సులను ఫేస్ లిఫ్టింగ్ చేస్తున్నాము. మూడు జిల్లాలకు సంబంధించిన యూనిట్లు,గేరు బాక్సులు వంటివి అవసరమైన వాటికి సకాలంలో సప్లై చేస్తున్నాము. వాహనాలన్నీ ఆన్ రోడ్ పై ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. " -అజ్మతుల్లా, మేనేజర్, కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాపు.
మూడు జిల్లాల పరిధిలో ఆర్టీసీకి చెందిన 1,113 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. వీటిలో 10 లక్షల నుంచి 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 243 గుర్తించారు. వీటిని యుద్ధప్రాతిపదికన కండీషన్‌లోకి తెచ్చే విధంగా ఇంజినీరింగ్ సిబ్బంది పనులు చేస్తున్నారు. గతేడాది మొత్తం 30 బస్సులకు మరమ్మతులు చేస్తే.. ఇప్పుడు నెలకు 30 బస్సులకు మరమ్మతులు చేసేలా శరవేగంగా పనులు చేస్తున్నారు. ఆర్టీసీ ఇంజినీరింగ్ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా 150 మంది వరకు పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
" డిపోల నుంచి వచ్చిన బస్సుల్లో ఏమేమి పార్టులు పోయాయో.. సరి చూసుకుని పోయిన వాటిలో కొత్త పార్టులు వేసి వాటిని కొత్తవిగా మార్చుతాం. " -రమణారెడ్డి, సీనియర్ కోచ్ బిల్డర్
" ఫేస్ లిఫ్టింగ్ వెహికిల్స్ అంటే.. 12లక్షల కిలోమీటర్లు లోపు తిరిగినవి. అటువంటి వాహనాలను ఎంచుకుని బాడీ డామేజి పార్టులను తొలగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొత్త వాటిని ఇక్కడ అమరుస్తాము. " -రాంబాబు, అసిస్టెంట్ మేనేజర్
జోనల్ వర్క్ షాపులో కొత్తరూపు సంతరించుకుంటున్న పల్లెవెలుగు బస్సులు.. మరో రెండేళ్ల పాటు సురక్షితంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరో 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగే విధంగా బస్సులను కండీషన్‌లో పెడుతున్నామని అంటున్నారు.
ఇదీ చదవండి : special busses for sankranti : పండగ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు