వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. గ్రామ సచివాలయం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదని కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. 48 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయానికి సంబంధిత పంచాయతీ అధికారులు పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు బిల్లు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2వ తేదీన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అప్పటినుంచి కూడా పలుమార్లు అధికారులకు వెళ్లినప్పటికీ స్పందించలేదని తెలిపారు. తనకు బిల్లు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉండటంతో బయట చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: Attack: విశాఖ కేజీహెచ్‌లో అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వద్దన్నందుకు దాడి