కడపజిల్లా గండికోటలో 23 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీలు నిల్వ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. రోజురోజుకీ ముంపు గ్రామాల్లోకి పెరుగుతున్న జలప్రవాహం.. స్థానికుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గండికోట జలాశయంలో 12 టీఎంసీల నీరు ఉన్నప్పుడే కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు బీసీ, ఎస్సీ కాలనీలకు నీరు చేరాయి. గండికోట ముంపు కింద ఉన్న 7 గ్రామాలకూ పరిహారం, పునరావాసం కల్పించాల్సి ఉంది. జిల్లా అధికార యంత్రాంగం ఉన్న ఫలంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందేనని చెప్పడంతో ముంపు వాసులు గత 17 రోజుల నుంచీ ఆందోళన చేస్తూనే ఉన్నారు.
శుక్రవారం గండికోటలో 13 టీఎంసీలు నిల్వ చేశారు. రోజురోజుకూ గండికోటలో నీటి నిల్వ పెరుగుతుండటంతో ముంపువాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లకు పది లక్షలు, పునరావాసం ప్యాకేజీ కింద 7 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఇళ్లు ఖాళీ చేయించటం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వారం కిందట కలెక్టర్ నిర్వహించిన సమావేశంలోనూ ముందు ఇళ్లు ఖాళీ చేస్తేనే పరిహారం ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన వారం రోజులు గడువు ముగుస్తుండటంతో.. ముంపువాసుల ఆందోళన తారస్థాయికి చేరింది.
ప్రభుత్వం వేధింపు ధోరణి మానుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. పరిహారం ఇస్తున్నామంటూ ఎప్పుడు పడితే అప్పుడు నోటిఫికేషన్‌లు జారీ చేస్తున్న ప్రభుత్వం.. బాధితులకు ఎందుకు సాయం ఇవ్వట్లేదంటూ ప్రశ్నించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిహారం ఇవ్వలేదనే ఆరోపణతో.. చంద్రబాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై.. అదే కేసు నమోదు చేస్తే తప్పేంటని వామపక్ష నేతలు ప్రశ్నించారు. గండికోటలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని.. ఇప్పటికిప్పుడు 23 టీఎంసీలు నింపాలనే నిర్ణయాన్ని మానుకోవాలని సీఎంను కోరారు.
కడప జిల్లాలోని కుందూ, పెన్నానదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నేరు చేరుతోంది. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 75 టీఎంసీలు దాటింది. సోమశిల వెనక జలాల కారణంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట, అట్లూరు మండలాల్లోని ముంపు గ్రామాలకు నీరు చేరింది. అట్లూరు వద్ద వంతెన పై నుంచీ వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడటంతో.. పునరావాసం, సాయం కోసం ముంపు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: చైనాతో ఉద్రిక్తతలపై కేంద్రం సమగ్ర సమీక్ష