కడప జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తయింది. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని 206 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 5742 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచి 1477, వార్డు సభ్యుడి స్థానాలకు 4265 ఉన్నాయి. ఆదివారం సర్పంచి 788, వార్డు సభ్యుడి స్థానాలకు 2878 నామినేషన్లు దాఖలయ్యాయి. అయిదు గ్రామ పంచాయతీల్లో ఒకే అభ్యర్థి చొప్పున పోటీలో నిలిచారు.
![five Panchayati Unanimous](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cdp12_0102newsroom_1612158960_799.jpg)
ఇదీ పరిస్థితి...
చాపాడు..
సీతారామపురం గ్రామ పంచాయతీలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఫలితంగా వైకాపా మద్దతుదారు వర్ర స్వాతి ఏకగ్రీవ ఎన్నిక దాదాపు ఖరారైంది. పలు గ్రామ పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేయకపోయినా.. వైకాపాలోనే కొన్ని వర్గాల మధ్య సర్పంచి పదవి కోసం పోటీ నడుస్తోంది. ఒకవేళ వీటిల్లో రాజీ కుదిరితే ఏకగ్రీవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్.ఓబాయపల్లె, విశ్వనాథపురం, లక్ష్మీపేట, సీతారామపురం, పెద్దగురువలూరు, చిన్నగురువలూరు, వెదురూరు, కుచుపాప పంచాయతీల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వనాథపురం పంచాయతీలో రూ.లక్షల్లో డబ్బులు చెల్లించి సర్పంచి పదవిని దక్కించుకునేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దువ్వూరు..
పెద్దజొన్నవరం, ఎర్రబల్లె, సంజీవరెడ్డిపల్లె పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు మాత్రమే పోటీలో నిలిచారు. మాజీ ఎంపీపీ కానాళ్ల చంద్రావతమ్మ స్వగ్రామం పెద్దజొన్నవరం. దీంతో ఇక్కడ ధూళ్ల మరియమ్మ ఏకగ్రీవం అవనుంది. ఎర్రబల్లెలో గతేడాది ఎంపీటీసీ స్థానాన్ని వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. అప్పుడు జరిగిన ఒప్పందం మేరకు ప్రస్తుతం సర్పంచి స్థానాన్ని చెరో రెండున్నరేళ్లపాటు వైకాపా, తెదేపా మద్దతుదారులు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చిన్నకమ్ముగారి మదార్‌బీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే.
డీసీసీబీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి స్వగ్రామం పుల్లారెడ్డిపేట సంజీవరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ఉంది. ఇక్కడ మొత్తం 10 వార్డు స్థానాలు, సర్పంచి స్థానానికి వైకాపా మద్దతుదారులు మాత్రమే నామనేషన్లు దాఖలు చేశారు. ఈ పంచాయతీలో సర్పంచి స్థానానికి తిరుపాలరెడ్డి భార్య ఇరగంరెడ్డి వీరమ్మ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దువ్వూరు పంచాయతీకి వైకాపా, తెదేపా, భాజపా-జనసేన మద్దతుదారులతోపాటుగా స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు.
- మైదుకూరు : ప్రతి పంచాయతీలో వైకాపా, తెదేపా మద్దతుదారులు పోటీలో ఉన్నారు.
- ఖాజీపేట : సన్నపల్లె పంచాయతీలో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- బి.మఠం : ప్రతి పంచాయతీలో వైకాపా, తెదేపా మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. రేకులకుంట, సోమిరెడ్డిపల్లెలో భాజపా- జనసేన మద్దతుదారులు బరిలో ఉన్నారు.
- రాజుపాళెం : ప్రతి పంచాయతీలో తెదేపా, వైకాపా మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్నిచోట్ల భాజపా మద్దతుదారులు పోటీలో ఉన్నారు. కొర్రపాడులో వైకాపా నుంచి రెండు వర్గాలు నామినేషన్లు దాఖలు చేశాయి.
- ప్రొద్దుటూరు : ప్రతి పంచాయతీలో వైకాపా, భాజపా మద్దతుదారుల మధ్య పోటీ నడుస్తోంది. తెదేపా మద్దతుదారుల పోటీపై స్పష్టత రాలేదు. కొత్తపల్లెలో వైకాపాలో రెండు వర్గాల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. గోపవరంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య బలపరిచిన అభ్యర్థి డానియల్ తెదేపా మద్దతుదారుడిగా పోటీలో ఉన్నారు.
- బద్వేలు : ప్రతి పంచాయతీలో తెదేపా, వైకాపా మద్దతుదారుల మధ్య పోటీ నడుస్తోంది. రాజుపాళెం గ్రామ పంచాయతీలో వైకాపా మద్దతుదారు పోకల రమాదేవి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. ఈ పంచాయతీలో ఏకగ్రీవం చేసుకున్నందుకుగాను రూ.25 లక్షలు దేవాలయ అభివృద్ధికి చెల్లించేట్లుగా ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
- కాశినాయన : ప్రతి పంచాయతీలో వైకాపా, తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు. సావిశెట్టిపల్లెలో సీపీఎం మద్దతుదారుడు నామినేషన్ వేశారు. కోడిగుడ్లపాడు గ్రామ పంచాయతీలో సర్పంచి పదవి కోసం రూ.30 లక్షల వేలంపాట పాడినట్లు విశ్వసనీయ సమాచారం.
- గోపవరం : ప్రతి చోట వైకాపా, తెదేపా మద్దతుదారులు పోటీలో ఉన్నారు.
- పోరుమామిళ్ల : ప్రతి పంచాయతీలో తెదేపా, వైకాపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు. పోరుమామిళ్ల మేజర్ పంచాయతీలో వైకాపా మద్దతుదారు జడ్పీటీసీ మాజీ సభ్యుడి భార్య సురేఖ, తెదేపా మద్దతుదారుడిగా యనమల సుధాకర్ బరిలో ఉన్నారు. ఇక్కడ సీపీఐ మద్దతుదారుడితోపాటు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.మొదటిదశ ఐదింట ఏకగ్రీవం!
ఇదీ చూడండి: లంక గ్రామాల్లో ఓటుకు అర్థమే వేరు.. ఎన్నికల్లో కట్టుబాట్లదే పైచేయి