ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన రేషన్ సరకుల పంపిణీ రెండు రోజులు ముందుగానే ప్రారంభమైంది. కరోనా లాక్‌డౌన్‌తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తాయి. కొందరు సామాజిక దూరం పాటిస్తే మరికొన్ని ప్రాంతాల్లో ఆ ఊసే లేకుండా పోయింది. కొందరు చౌకధరల డీలర్లు.. చొరవ తీసుకొని ఇంటికెళ్లి సరకులు అందజేశారు.
ఉత్తరాంధ్రలో..
ఉత్తరాంధ్ర పరిధిలోని 3 జిల్లాల్లో ప్రశాంతమైన వాతావరణంలో రేషన్ సరకుల పంపిణీ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో వేకువ జాము నుంచే ప్రజలు రేషన్ దుకాణాలకు చేరుకున్నారు. లాక్‌డౌన్ ఉన్నందున ఎక్కడ బియ్యం, పప్పులు అయిపోతాయోనని ఆందోళన చెందిన ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు కట్టారు. కొంతసేపు జనాలు గుంపులు గుంపులుగా వచ్చినా...వాలంటీర్ల సహాయంతో అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. విశాఖ జిలాల్లోని పలు చోట్ల బకెట్‌తో నీళ్లు, సబ్బులు ఏర్పాటు చేశారు. మార్కింగ్‌లు వేసి లబ్ధిదారులను నిలబెట్టారు. సామాజిక దూరం పాటించేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల్లో ...
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని చౌక డిపోల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకున్నారు. ముందుగా వృద్ధులకు సరుకులు అందించేలా చర్యలు చేపట్టారు. తునిలో రేషన్‌దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బయోమెట్రిక్ యంత్రాలు పని చేయకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ జనాలు బారులు తీరారు. అన్ని రేషన్ దుకాణాల వద్ద సమదూరం పాటిస్తూ.. నిల్చున్న పరిస్థితి కనిపించింది. ప్రజలు ఒక్కసారిగా ఎగబడకుండా...50 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
వేలి ముద్రలు లేకుండానే..
లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు నగరంలో 240 వరకు రేషన్ దుకాణాలుండగా చాలా చోట్ల సాంకేతిక సమస్యలు వెంటాడాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా బయోమెట్రిక్ విధానం వద్దని... వేలి ముద్రలు లేకుండా ఇవ్వాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఎండ తీవ్రతతో మంగళగిరిలో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. నరసరావుపేట పరిధిలోని రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు కాశారు. మరోవైపు... కృష్ణా జిల్లా వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. గన్నవరం, నందిగామ నియోజకవర్గాల్లోని పరిధిలో సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు సరుకులు తీసుకున్నారు.
శానిటైజర్లు ఏర్పాటు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల సామాజిక దూరం పాటిస్తూ రేషన్ సరుకులు తీసుకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో గుంపులుగా ఎగబడ్డారు. మరికొన్ని చోట్ల శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజే సరుకులు తీసుకోవాలన్న ఆతృుతతో నందాల్యలో రేషన్ దుకాణాలు జనసందోహంగా మారాయి. కడపలో లబ్ధిదారులు క్యూలైన్లలో నిలబడలేక సంచులను వారి స్థానంలో పెట్టారు. అనంతపురం జిల్లాలో పలు చోట్ల రేషన్ దుకాణాలకు సరుకులు సకాలంలో రాని కారణంగా లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారు.
చీరాలలో బ్రేక్...
కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం ప్రకాశం జిల్లా చీరాలలో ఉన్న కారణంగా రేషన్ పంపిణీ ప్రక్రియను ఆపివేశారు. చీరాల పట్టణంతోనూ పాటు మండలంలోని అన్ని గ్రామాలకు రేషన్ నిలిపివేశారు. కరోనా ప్రబలటంతో దుకాణాల వద్ద లబ్ధిదారులు గుమిగూడే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 15 వ తేదీ వరకు రేషన్ సరుకుల పంపిణీకి సమయం ఉందని అధికారులు చెప్పారు. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు అందుతాయని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: