కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేట గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుంటే ఈనెల 28వ తేదీన జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అనుమానంతో ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.
ఈ నెల 30వ తేదీన సాయంత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. నవాబుపేటకు వైద్య సిబ్బందిని పంపించి రక్షణ చర్యలు చేపట్టారు. అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తి సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
ఆ వ్యక్తి ముద్దనూరు మండలం గంగదేవి పల్లె గ్రామంలోనూ కొద్దిరోజులు నివాసం ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టినట్లు మైలవరం వైద్యాధికారి డాక్టర్ అజరయ్య తెలిపారు. మైలవరం మండలంలో తొలి కరోనా కేసు నమోదు కావడం వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. నవాబుపేట గ్రామంలోకి ఇతరులు రాకుండా ముళ్ళ కంపలు అడ్డుగా వేసి పోలీసులు కట్టుదిట్టం చేశారు.
ఇదీ చదవండి: