Drone agriculture: డ్రోన్ ఆపరేట్ చేస్తున్న ఈ మహిళే కనకదుర్గ. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామం. ఈమె భర్త బాపిరెడ్డి.. సొంత పొలం లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. కనకదుర్గ కూడా భర్తతోపాటు రోజూ పనుల్లో పాలుపంచుకునేవారు. ప్రస్తుతం ఈ దంపతులు పూలతోటలు సాగు చేస్తున్నారు. పురుగుమందుల పిచికారిలో ఇబ్బందులు, కూలీల సమస్యలు పరిష్కరించేందుకు.. బాపిరెడ్డి సెకండ్ హ్యాండ్ డ్రోన్ కొన్నాడు. కనకదుర్గ కూడా ఆసక్తిగా డ్రోన్ ఆపరేట్ చేయటం నేర్చుకున్నారు.
మన రాష్ట్రంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే.. వాటి నిర్వహణ సాంకేతిక విద్య అభ్యసించిన వారే ఎక్కువగా చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఓ మహిళా రైతు ఇప్పుడు డ్రోన్ ఆపరేట్ చేస్తుండటం విశేషం. కేవలం ఐదో తరగతి మాత్రమే చదువుకున్న కనకదుర్గ.. అవసరం అన్నీ నేర్పిస్తుందని నవ్వుతూ సమాధానం చెబుతున్నారు.
కనకదుర్గ డ్రోన్ ఆపరేటింగ్ నేర్చుకోవడంతో బాపిరెడ్డిపై పని భారం తగ్గింది. పండిన పూలు మార్కెట్ కు తీసుకెళ్లటంతో పాటు ఇతర పనులు బాపిరెడ్డి చూసుకుంటుంటే... కూలీలతో పనులు చేయించి.. డ్రోన్ ద్వారా పురుగుమందులు చల్లే పని కనకదుర్గే చూసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా నిమిషాల్లోనే పని పూర్తవుతోందని... పురుగుమందు 25శాతానికి పైగా ఆదా అవుతుందని బాపిరెడ్డి చెబుతున్నారు.
ఇవీ చదవండి: