ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా మహిళలు, బాలికలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షణికావేశంలో చేస్తున్న తప్పిదాలు దారుణ ఫలితాలను మిగుల్చుతున్నాయి. తాజాగా గుంటూరులోని పరమాయికుంట వద్ద టిపిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన యువతి దారుణ హత్యకు(murder in guntur) గురైంది. ఈ దారుణ ఘటన.. స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
గుంటూరు పెదకాకాని రోడ్డులోని పరమాయికుంటలో అల్పాహారం తీసుకెళ్లేందుకు హోటల్‌కు వచ్చిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులను కత్తితో బెదిరించి.. ద్విచక్రవాహనంపై దుండగుడు పరారయ్యాడు.
కారణాలు అన్వేషణ..
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనకు గల కారణాలను మృతురాలి తల్లి, సోదరుడిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అడిగి తెలుసుకున్నారు. మృతురాలు బీటెక్ నాల్గో సంవత్సరం విద్యార్థిని రమ్యగా గుర్తించారు. యువతికి పరిచయం ఉన్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యతో తల్లిదండ్రులు, బంధువులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
దర్యాప్తు వేగవంతం..
రమ్య హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి పరిచయం ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రమ్య ఫోన్లోని సమాచారాన్ని సేకరించేందుకు చరవాణి లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫోన్ ద్వారా నిందితుడి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. తమది వ్యవసాయం ఆధారిత కుటుంబం అని, తమకు ఎవరితోనూ విభేదాలు లేవని మృతురాలి తండ్రి వెంకట్రావ్ విలపించారు.
జీజీహెచ్‌కు నేతలు..
హత్యకు గురైన రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌లో పలువురు నేతలు సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మేయర్ కావటి మనోహర్ నాయుడు రమ్య భౌతికకాయాన్ని సందర్శించి.. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇలాంటి ఘటన జరగడం దారుణమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఇలాంటి దారుణ ఘటనలను సమాజం మొత్తం ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. రమ్య శరీరంపై చాలా చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని.. తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పద్మ అనుమానించారు. నిందితుడిని కఠినంగా శిక్ష పడేలా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: