Postcards To Governor: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు తాడేపల్లి రైతులు పోస్టుకార్డులు రాశారు. యూ-1 జోన్ తొలగించాలని అందులో కోరారు. జోన్‌ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని రైతులు పోస్టుకార్డుల్లో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. యూ-1 జోన్ తొలగించాలని తాడేపల్లిలో 13 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు.
యూ-1 జోన్ అంటే..: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి పరిధిలోని అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ స్థలాల లీజుకు స్పందన కరవు.. 30 స్థలాలకు టెండర్లు పిలిస్తే.. ఒక్క చోటే..!