తెదేపాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతోపాటు అనుబంధ సంఘాల బాధ్యులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చంద్రబాబు నిర్ణయించారు.
నవంబర్లో కొత్త కమిటీలు
ముందుగా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. అనంతరం పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. విజయదశమి రోజున పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీని నియమించనున్నారు. కమిటీ నియమించిన తర్వాత నవంబర్ చివరి కల్లా పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి.. కొత్త కమిటీలు వేయాలని నిర్ణయించారు. ప్రతి కమిటీలో బలహీన వర్గాలకు అవకాశం కల్పించనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలన్నీ బ్యాలెట్ పద్ధతిలోనే జరగనున్నాయి. అనుబంధ సంఘాలలో 33 శాతం యువత, 33 శాతం మహిళలు, 50 శాతం బడుగు.. బలహీనవర్గాల వారికి అవకాశం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు.
రీకాల్ చేయాలని నిర్ణయం
సామాజిక వర్గాల జనాభా ఆధారంగా... పదవులలో అవకాశాలు ఇవ్వనున్నారు. కార్యవర్గంలోకి ఎన్నికైన వారి పనితీరును నిర్ణీత సమయంలోగా పరిశీలించనున్నారు. పనితీరు బాగాలేని వారిని కార్యవర్గంలోని మెజారిటీ సభ్యుల నిర్ణయంతో రీకాల్ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై పార్లమెంటు వారీగా కమిటీలు
ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలన్నీ జిల్లా కమిటీలుగానే ఉండేవి. అయితే ఇకపై పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అనుబంధ సంఘాల ప్రక్షాళనతోనే తెలుగుదేశం పార్టీలోనూ కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: పంటితో వలిచాడు... చంద్రబాబును అబ్బురపరిచాడు