TDP Government Focus on Tourism in State : కూటమి ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి సారించింది. ఈ దిశగా వినూత్న ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తుంది. ఇటీవల రాజమహేంద్రవరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. విజయవాడ నుంచి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రుషికొండ బీచ్ అనువైనదిగా గుర్తించి అక్కడ నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిపుణుల బృందం అక్కడ పరిశీలించింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో వీఎంఆర్‌డీఏ (VMRDA) తో కలిసి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
గత ప్రభుత్వంలో గొప్పలకు పోయి : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తేలియాడే వంతెనను ఆర్‌కే బీచ్‌లో హడావుడిగా ప్రారంభించారు. ఎటువంటి అధ్యయనం చేయకుండా, ఎన్నికలకు ముందు గొప్పలకు పోయారు. దాన్ని ప్రారంభించిన రోజే అలల తీవ్రతకు కొట్టుకుపోయింది. అయినప్పటికీ ఎలాగైనా అందుబాటులోకి తేవాలని చూశారు. ఆ ప్రాంతం లోతుగా ఉండడం, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో వంతెన ఎప్పటికప్పుడు తెగిపోయింది. దీంతో అక్కడ కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా చివరికి చేతులెత్తేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేలా, తగు రక్షణాత్మక చర్యలతో తేలియాడే వంతెన ఏర్పాటుకు నిర్ణయించింది.
గోదారి జలసవ్వడుల నడుమ.. రుచులను ఆస్వాదిస్తూ..! రాజమహేంద్రవరంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్
జల విన్యాసాలకు : రుషికొండ తీరం జల విన్యాసాలకు పెట్టింది పేరు. ఇప్పటికే అక్కడ స్కూబా, కయాకింగ్, సర్ఫింగ్, జెట్ స్కీ, స్పీడ్ బోట్లు నడుపుతున్నారు. వాటి నుంచే ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు 25 శాతం ఆదాయం వస్తుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్కడ బోటింగ్ చేపడుతున్నారు. ఆ పడవల నిర్వహణకు తేలియాడే వంతెన వల్ల ఏర్పడే ఇబ్బందులు ఏముండొచ్చు అని పరిశీలిస్తున్నారు.
తీరం నుంచి బయలుదేరిన పడవలు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలంటే అక్కడ అలల పరిస్థితి ఆధారంగా చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఆ సమయంలో వంతెన అడ్డుగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించే అంశంపై నిపుణులతో చర్చిస్తున్నారు. అవసరమైతే పడవల నిర్వహణ ప్రాంతాన్నైనా మార్పు చేయొచ్చని సమాచారం.
భద్రత నడుమ : రుషికొండకు ప్రస్తుతం బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉంది. ఆ తరహా బీచ్‌లో తేలియాడే వంతెన వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగితే గుర్తింపు రద్దయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్రమత్తంగా నిర్వహించాల్సి ఉంది.
నిపుణుల సూచనతో : విశాఖ తీరంలో జాతీయ సముద్ర అధ్యయన విభాగం, కొన్ని పరిశోధన సంస్థల పరిశీలన తరువాత రుషికొండ బీచ్ అనువుగా ఉన్నట్లు గుర్తించారు. గురువారం జాతీయ సముద్ర అధ్యయన సంస్థ (ఎన్‌ఐవో), పర్యాటక, వీఎంఆర్‌డీఏ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో చూశారు. ప్రస్తుతం మర పడవలు నిర్వహిస్తున్న ప్రదేశం అనువైనదిగా గుర్తించారు. దానికి సమీపంలోనైనా ఏర్పాటు చేయొచ్చని సూచించారు.