రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెదేపా నేతలు, కార్యకర్తల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. వైసీపీ బాధిత తెదేపా కార్యకర్తలతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాధిత కార్యకర్తలకు 10వేల రూపాయల చొప్పున పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పనిచేశామని ఆనంద్ బాబు గుర్తు చేశారు. తాము వైసీపీలా ఆలోచించి ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఉండేవి కావన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ... తెదేపా కార్యకర్తలు సొంతూరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చిందని ఆరోపించారు. దేశంలో కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టిన ఏకైక పార్టీ తెదేపా మాత్రమేనన్నారు. పార్టీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొందామని... దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ప్రతి గురువారం సమీక్షిస్తున్నారని వివరించారు. తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులపై జాతీయ మానవ హక్కుల బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఆ సమయంలో వారికి వాస్తవాలు వివరించాలని సూచించారు. పోలీసులు పెట్టే ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. వైసీపీకి భయపడాల్సిన పనిలేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధైర్యం చెప్పారు. ఈ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ధైర్యంతో సహనంతో ఉండాలని సూచించారు. మొత్తం 221 మంది కార్యకర్తలకు ఆర్ధిక సాయం ఇవ్వాలని పార్టీ నిర్ణయించగా... వారిలో ఇవాళ 84మందికి 10వేల రూపాయల చొప్పున అందజేశారు. మిగతా వారికి ఆయా గ్రామాలకు వెళ్లి సాయం అందిస్తామని పార్టీ నేతలు తెలిపారు..
ఇదీ చదవండీ... 'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు'