వైకాపా ప్రభుత్వం ఏడాది కాలంలో నింగి నుంచి నేల వరకు దోచుకున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. వైకాపా నాయకుల అక్రమాలను బయటపెడుతున్నందుకే ప్రతిపక్ష పార్టీ నేతలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే మద్యం, మైనింగ్, కరోనా కిట్లతో పాటు ఆఖరికి బ్లీచింగ్ పౌడర్లోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
ప్రజల ప్రాణాలు కాపాడుతూ సేవలందిస్తున్న 108 అంబులెన్స్ నిర్వహణలో రూ.307 కోట్ల కుంభకోణంకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు బీవీజీ సంస్థ ఒక్క అంబులెన్స్ నిర్వహణ కోసం నెలకు రూ.1.31 లక్షలు ఖర్చు చేసిందని చెప్పారు. అయితే ఈ సంస్థను తప్పించి వైకాపా నేత విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన అరబిందో ఫౌండేషన్‌కు కట్టబెట్టారన్నారు. కొత్త అంబులెన్స్ కోసం నెలకు రూ.1.78 లక్షలు, పాత అంబులెన్స్‌ల నిర్వహణకు రూ. 2.21 లక్షల కేటాయింపు ఏ విధంగా చేశారని ప్రశ్నించారు. 108 వాహనాల నిర్వహణలో జరిగిన అవినీతిపై వైకాపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ కుంభకోణాలను బయట పెడితే తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని రవీంద్ర అన్నారు.
ఇదీ చూడండి: 'అవినీతి చేసిన వాళ్లను వదిలేసి.. ప్రశ్నించిన వారిపై కేసులు'