కొత్త ఇసుక విధానం తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం... భవన నిర్మాణదారులు, కార్మికులను ఆందోళనకు గురి చేస్తోంది. 3 నెలలుగా ఇసుక తవ్వకాలు నిలిచినందున...నిర్మాణరంగంలో స్తబ్దత నెలకొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో ఏప్రిల్ నుంచి తవ్వకాలపై నిషేధం విధించారు. ఎన్నికల నియమావళితో అప్పటి ప్రభుత్వమూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కొత్త ప్రభుత్వమైనా నిషేధం తొలగిస్తుందని భావించినా... నూతన ఇసుక విధానం రూపొందించాలని షాకిచ్చింది. దీని కోసం 2 నెలల సమయం పడుతుందని ప్రకటించారు. ఉన్న నిల్వలతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన నిర్మాణదారులు... ఇప్పుడు పనులు నిలిపేశారు. చాలాచోట్ల భవన నిర్మాణాలు గోడలతో నిలిచిపోయాయి.
రాష్ట్రంలో సుమారు 500కుపైగా ఇసుక రీచ్‌లున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక అక్కడక్కడా కొద్ది రోజులు రీచ్‌లు తెరిచారు. ఇసుక కోసం విపరీతంగా ఉన్న ఒత్తిడి తట్టుకోలేక... కలెక్టర్ల ఆదేశాలతో తవ్వకాలు మళ్లీ ఆపేశారు. నిర్మాణ రంగాన్నే నమ్ముకున్న మేస్త్రీలు, కూలీలకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. పనిలేక ఇల్లు గడవడం లేదంటూ గుంటూరులో కార్మికులు రోడ్డెక్కడం... పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భవన నిర్మాణదారులదీ దాదాపు అదే పరిస్థితి. కోట్లలో పెట్టబడి పెట్టి వడ్డీలు కట్టుకుంటూ... పనులు మాత్రం సగంలో నిలిపేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణం స్తంభిస్తే స్థిరాస్తి రంగంతోపాటు అనుబంధ రంగాలపైనా ప్రభావం పడుతుంది. పరోక్షంగా సిమెంట్, స్టీల్ వ్యాపారం కుదేలవుతుంది. ఈ ప్రభావం పన్ను రాబడిపై పడనుంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రత్యామ్నాయంగా రోబో శాండ్ ప్రోత్సహించాలని స్థిరాస్తి నిపుణులు సూచిస్తున్నారు.
ఇసుక తవ్వకాల నిషేధానికి ముందు జాగ్రత్తపడిన వారిలో కొందరి అత్యాశకు.. భవన నిర్మాణదారులు బలవుతున్నారు. లారీ ఇసుకను 15 వేల నుంచి 20వేలకు కొనాల్సి వస్తోంది.
ఇవీ చదవండి:- " పోలవరం రివర్స్ టెండర్లపై సమాచారం లేదు"