అవసరానికి మించి సంపాద వ్యర్థమని....పిల్లలు, మళ్లీ వారి సంతానం కోసం సంపాదించడం మానుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కొవిడ్ కారణంగా లక్ష మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని.. వీధుల్లో తిరిగే పిల్లలు దేశంలో కోటి80 లక్షల మంది ఉన్నారని గుర్తుచేశారు. పిల్లలు రోడ్డు మీద పెరిగితే అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని, వీరిని సంరక్షించడంలో ప్రభుత్వంతోపాటు ప్రజలు ముందుకు రావాలని జస్టిస్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ పాటిబండ్ల సీతారామయ్య 139వ జయంతోత్సవం, పాఠశాల వజ్రోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు.
దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయని... వీటిని అమలు చేయడమే కీలకమని జస్టిస్ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పదవీ హోదా కాదని... అదొక బాధ్యతన్నారు. పదవి వచ్చిన తర్వాత బాధ్యతలు మర్చిపోరాదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా మతాలు, కులాల పేరుతో ప్రజలను విడగొట్టడం సరికాదన్నారు. ఆర్థిక స్థోమత కోసం కాకుండా మానసిక వికాసానికి విద్య అవసరమన్నారు. దేశాభివృద్ధి, సామాజిక అభివృద్ధి విద్యపైనే ఆధారపడి ఉందని జస్టిస్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :