గుంటూరు జిల్లాలో మానసిక స్థితి సరిగా లేని వెంకటరత్నం అనే వృద్ధురాలు లాక్డౌన్కు సరిగ్గా ఒకరోజు ముందు ఇంటినుంచి వెళ్లిపోయింది. కనిపించిన వాహనం ఎక్కి గుంటూరు చేరింది. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ తో ఎటూ వెళ్లలేక గుంటూరులోనే చిక్కుకుపోయింది. వీధుల్లో తిరుగుతూ దాతలు పంచిన ఆహారం తిని ఆకలి తీర్చుకుంది. రోడ్లపైనే తిరుగుతూ కాలం వెల్లబుచ్చింది. అదే సమయంలో ఆమె కోసం తన ముగ్గురు కుమారులు అన్నిచోట్లా వెతికారు. కానీ జాడలేదు. అయితే గురువారం ఓ వ్యక్తి ఆ వృద్ధురాలిని పలకరించి ఎక్కడ నుంచి వచ్చారని ఆరా తీశారు.
తన కుమారుడి చరవాణి నెంబర్ చెప్పగలిగింది. దీంతో అతను వారికి సమాచారం ఇచ్చాడు. లాక్ డౌన్ కావటంతో అతని కుమారుడు ప్రత్యేకంగా పోలీసుల అనుమతి తీసుకున్నారు. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామం నుంచి వాహనం తీసుకుని గుంటూరుకు వచ్చారు. అదే సమయంలో ఆమె దారిన వెళ్తున్న వారిని మంచినీళ్లు అడుగుతోంది. వెంటనే వాహనం దిగిన కుమారుడు సుబ్బారావు... తన తల్లి దాహం తీర్చాడు. కుమారుడిని చూసి ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. ఆమెను వాహనంలో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. స్థానిక అధికారులు ఆమెను పరీక్షించి హోం క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. ఇలా లాక్ డౌన్ కారణంగా ఓ తల్లి... తన కుటుంబానికి దూరమైంది. 40 రోజుల తర్వాత కన్నబిడ్డల వద్దకు చేరింది.
ఇవీ చదవండి: ఆయన చెట్టుకు 'మోదీ' సహా.. వందల రకాల పండ్లు