Lokesh on poor people houses : గుంటూరు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. దుగ్గిరాలలో పర్యటించిన నారా లోకేశ్ వైకాపా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రెండున్నర ఏళ్లలో ప్రజల జీవితాల్లో మార్పు ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. జగన్ తాను చెప్పినట్లే ప్రజలపై భారం వేస్తూ వెళ్తున్నారన్నారు. గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు, కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదని ఆరోపించారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని నారా లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్ పేరుతో 1983 నుంచి కట్టిన ఇళ్లకు రూ.10 వేలు వసూలు చేశారన్నారు. వరద నష్టం అంచనా కూడా సరిగా చేయడం లేదన్నారు. వరద నష్టాన్ని త్వరగా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని లోకేశ్ సూచించారు.
రెండున్నరేళ్లలో పదివేల ఇళ్లైనా కట్టారా ...??
మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్ నిరుపేదల గూడు గోడు ముఖ్యమంత్రికి వినిపించదా అని ప్రశ్నించారు. కురగల్లు గ్రామంలో సమారు 226 మంది తమ గోడును లోకేశ్ ఎదుట వెళ్లబోసుకున్నారు. దశాబ్దాలుగా తాము ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వ భూమిలో ఉంటున్నారని ఉన్నఫళంగా ఖాళీచేయాలని నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కురగల్లు బాధితులతో మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ లోకేశ్ ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. అధికారులు మానవత్వంతో ఆలోచించి నిరుపేదల ఇంటి సమస్యని పరిష్కరించాలని కోరారు. రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తుందని ఆరోపించారు. సీఆర్డీఎ పరిధిలో పేదలు ఇళ్లు తొలగింపునకు నోటిసు ఇచ్చే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులకు లేదన్నారు. కురగల్లు బాధితులకి న్యాయం జరిగేవరకూ అండగా ఉంటానని, న్యాయపోరాటానికి పూర్తిసహాయసహకారాలు అందిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : Chandrababu comments: 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా?- చంద్రబాబు