ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించటం అత్యంత అప్రజాస్వామిక చర్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర గవర్నర్‌కు లేఖలు రాశారు. ఎన్నికల కమిషనర్ని తొలగించే అంశం రాష్ట్ర పరిధిలో లేదని ఆర్టికల్ 243(కె) చెబుతుందన్నారు. కరోనాతో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని... రాష్ట్రంలోనూ అదే తరహాలో నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే ఎన్నికల వాయిదా వేయటాన్ని తట్టుకోలేకే ఎస్ఈసీ రమేష్ కుమార్‌ని తొలగించారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణికి ఈ నిర్ణయం పరాకాష్ఠగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను తిరస్కరించాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.
ఇదీ చదవండి : ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో!