junior doctors protest: జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జూడాలు డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో మూడోరోజులుగా జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. విధులు బహిష్కరించిన జూడాలు.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులపై ఓ రోగి బంధువు దాడి చేయడాన్ని నిరసిస్తూ.. వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు.
కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే.. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేవరకు తాము విధులకు హాజరుకాబోమని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.
కర్నూలులోనూ జూడాల నిరసన..
గుంటూరులో జూడాలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా.. కర్నూలులోనూ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి వసతులూ లేకున్నా.. విధులు నిర్వహిస్తున్నామన్నారు. అయినప్పటికీ.. తమపై దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకపోతే.. అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి..