గుంటూరు జిల్లాలో ఏర్పాటవుతున్న టెక్స్‌టైల్ పార్క్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు వ్యక్తులు ఈ టెక్స్ టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు స్పిన్నింగ్, జిన్నింగ్‌కే పరిమితమైన గుంటూరు జిల్లాలో.. ఈ పార్క్ ద్వారా వస్త్ర తయారీ పరిశ్రమ ఊపందుకోనుంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.
దేశీయంగా వస్త్రాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2013లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మూడు చోట్ల పార్కుల ఏర్పాటుకు అనుమతించింది. పార్క్‌కు అవసరమైన సహాయ సహకారాలతోపాటు పెట్టుబడిలో 30శాతం రాయితీని కూడా ప్రకటించింది. కేంద్ర నిర్ణయంతో గుంటూరు జిల్లాలో స్పిన్నింగ్ మిల్లులు నిర్వహిస్తున్న దాదాపు 20మంది ప్రమోటర్లుగా ముందుకొచ్చారు.
గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ పేరుతో చిలకలూరిపేట మండలం గోపాలంవారిపాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 110 కోట్ల రూపాయల పెట్టుబడితో పార్క్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే.. 2014 తర్వాత ప్రభుత్వం మారడం, రాయితీ 10శాతానికి తగ్గించటంతో 12మంది ప్రమోటర్లు వెనక్కుతగ్గారు. ఆ భారం మిగతా వారిపై పడింది. ఎలాగోలా వాటిని అధిగమించి టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. మొత్తం 70యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండగా.. 40 యూనిట్లు సిద్ధమయ్యాయి. యంత్రాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే మార్చికల్లా 10 నుంచి 15 యూనిట్లలో ఉత్పత్తి మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే.. వెయ్యి కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు రావటంతోపాటు.. 2వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.
"40 షెడ్లు వాటాదారులకు అప్పగించాము. వారు వాటిని తీసుకుని కావల్సిన యంత్రాలను ఆర్డరు చేయిస్తున్నారు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రుణాలు అందగానే ఎల్ సి తెరుస్తారు. తర్వాత కావల్సిన యంత్రాలు వస్తాయి. ఆ తర్వాత ఉత్పత్తి చేయటం మొదలు పెట్టడమే తరువాయి" -పున్నయ్య చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
"ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ లో స్పిన్నింగ్ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. దాదాపుగా 30లక్షల స్పిన్నింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ టెక్స్ టైల్ పార్కులో దాదాపు అన్ని మౌలిక వసతులను పూర్తి చేశాం. త్వరలో తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాం." - సామినేని కోటేశ్వరరావు, మేనేజింగ్ డైరెక్టర్
రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా పత్తి పండిస్తున్నారు. అందుకే ఇక్కడ అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. జిన్నింగ్, స్పిన్నింగ్ పరిశ్రమలు వచ్చాయి. అయితే.. వస్త్ర పరిశ్రమ మాత్రం ఊపందుకోలేదు. కేవలం దారంతో సరిపెడుతున్నారు. ఇక్కడే.. వస్త్రాలు తయారైతే ఉపాధితో పాటు పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయమూ వస్తుంది. వీవింగ్ ద్వారా తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్, డైయింగ్ చేసే పరిశ్రమలు భవిష్యత్‌లో ఏర్పాటు చేయవచ్చు. గుంటూరు టెక్స్‌టైల్ పార్కులో కార్మికుల కోసం శిక్షణ కేంద్రం, క్వార్టర్లు, వసతి గృహాలు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో యూనిట్లు ఎక్కువ వచ్చినా పార్కు విస్తరించేందుకు వీలుగా మరో 50ఎకరాల భూమి సిద్ధం చేసి ఉంచారు.
ఇదీ చదవండి :
mla anagani satya prasad: కాపుల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా..? - ఎమ్మెల్యే అనగాని