రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఓ ప్రకటన ఏజెన్సీ గుంటూరులో కాలు మోపింది. ఆ ఏజెన్సీకి అమాత్యుడొకరు అండగా ఉన్నారని.. నగరపాలక సంస్థ ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రితో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని సదరు నిర్వహకుడు మంత్రి నుంచి ఓ సిఫార్సు లేఖ పట్టుకొచ్చి.. నగరంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వేసుకుని వాటిపై ప్రకటనల ఆదాయం పొందుతోంది. మంత్రి సిఫార్సు చేస్తే నిబంధనలు పక్కన పెట్టేసి ఆయన కోరిందే తడువుగా అనుమతులు ఎలా ఇస్తారనే విమర్శలు వస్తున్నాయి.
టెండర్ల ద్వారా మాత్రమే ఏజెన్సీలను ఎంపిక చేస్తామని అమాత్యునికి తెలియజేసి.. ఆ మేరకు ఆ ఏజెన్సీని నిలువరించే బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది. అలాంటిది వారికి అనుమతులు ఇవ్వటంపై విమర్శలు వస్తున్నాయి. అదే సామాన్యులు ఎవరైనా తన ఇంట్లో జరిగే శుభ కార్యాలకు రహదారులు, కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలు వేస్తే వెంటనే వాటిని తొలగించి నానా హడావుడి చేస్తారు. లేదంటే నగర పాలక సంస్థకు రుసుములు చెల్లించి వాటని పెట్టుకోవాలని సూచిస్తారు.
మొత్తంగా నగర పాలక సంస్థకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలు లబ్ధి పొందుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరంలోని రహదారులు, డివైడర్ల మధ్య, విద్యుత్ స్థంభాలకు, ముఖ్య కూడళ్లలో హోర్డింగ్లు పెట్టుకోవాలన్నా, ఫ్లెక్సీలు వేసుకోవాలన్న నగర పాలక సంస్థ టెండర్లలో పాల్గొని.. వాటి నిర్వహణకు అనుమతి పొందాలి. వారు మాత్రమే అధికారికంగా ప్రజలు, వ్యాపార మార్గాలు, విద్యా సంస్థల నుంచి తమ వివరాలను ప్రదర్శించుకుంటాయి.
కొవిడ్ నేపథ్యంలో కరోనా వైరస్ తీవ్రతను తెలియజేసే ప్రకటనలను మాత్రమే ప్రదర్శించాలని.. వేరే ఎటువంటి ప్రకటనలు స్వీకరించ వద్దని జిల్లా పాలనాధికారి శామ్యూల్ అనంద కుమార్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ఆదేశాలు జారీ చేశారు. కానీ వాటితో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన ఫ్లెక్సీలు భారీగానే ఉంటున్నాయి. ఏ ఏజెన్సీకైనా నగరపాలక ప్రణాళిక విభాగమే ఏయే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఎన్ని పెట్టుకోవాలో.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటికి అనుమతిస్తాయి. కానీ ఈ ఏజెన్సీ విషయంలో అరకమైన కసరత్తు జరగలేదని మంత్రి సిఫార్సు కావడంతో.. అధికారులు చూసి చూడనట్లు ప్రకటనలకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలో నాలుగైదు ఏజెన్సీలు ఆయా ప్రాంతాల్లో అనుమతులు పొంది నగరపాలక సంస్థకు రుసుములు చెల్లిస్తూ పక్కాగా వ్యవహరిస్తున్నాయి. ఆ ఏజెన్సీలకు కూడా బెదిరింపులు వచ్చి పడుతున్నాయి. ఇక మీదట నగరం మొత్తం తామే నిర్వహిస్తామని.. నెమ్మదిగా వైదొలగాలని సూచనలు చేస్తున్నారని తెలిసింది. ప్రజలు ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటే వెంటనే తొలగించే అధికారులు.. ఈ ఏజెన్సీ విషయంలో ఉదాసీనంగా ఉండటం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం మరో మారు నోటీసులు ఇచ్చి... వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఇదీ చదవండీ...