హిందూ దేవుళ్లను కించపరిచేలా, భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై నమోదైన కేసుపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అతడిని కస్టడీకి కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 3 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలో ప్రవీణ్ చక్రవర్తిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే కాకినాడ గ్రామీణం వాకలపూడిలో ఉన్న విద్యాసంస్థ, సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురంలో ప్రవీణ్ చక్రవర్తి నివాసం, విద్యా సంస్థల్లో సోదాలు నిర్వహించింది. సీఐడీ సైబర్‌క్రైం ఎస్పీ జి.ఆర్.రాధిక ఆధ్వర్యంలోని బృందం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది. మరిన్ని ఆధారాల సేకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించింది. కొన్ని గ్రామాలను క్రైస్తవ విలేజీలుగా మార్చినట్లు ప్రవీణ్ చెప్పినందున ఆ గ్రామాలేవి? అన్న దానిపై పరిశోధిస్తున్నట్లు ఎస్పీ రాధిక తెలిపారు. ఈ వ్యాఖ్యలే నిజమైతే ప్రతి గ్రామానికీ వెళ్లి విచారిస్తామని తెలిపారు. తనిఖీల్లో కొన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలు దొరికాయని, మరికొన్ని ఆధారాలను అతడు సహా కుట్రదారులు దాచినట్లు అనుమానిస్తున్నామని ఎస్పీ రాధిక వెల్లడించారు. ఈ క్రమంలో కస్టడీలో వీటన్నింటిపైనా ప్రవీణ్ నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి
ప్రవీణ్ చక్రవర్తితో నాకు ఎలాంటి పరిచయం లేదు: మంత్రి కన్నబాబు