కోవిడ్ కారణంగా నష్టపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను... తిరిగి గాడిన పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర పరిశ్రమల శాఖకు పలు సూచనలు ఇచ్చినట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో తాను ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రజల చేతిలో డబ్బుండేలా చర్యలు చేపట్టాలని... అందుకోసం బ్యాంకు రుణాలు, పన్ను రాయితీలు ఇవ్వాలన్నారు. రాబోయే ఆరు నెలలకు జీఎస్టీని 50శాతం తగ్గించాలని సూచించారు.కరోనా కారణంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం, పన్నుల రాయితీ అందించాలని కోరారు. విమానయానం, పర్యాటక రంగం, ఆతిథ్యం, వినోదం, మౌళిక వసతులు, దుస్తులు, తోలు పరిశ్రమలకు.. రెండేళ్లపాటు పన్నులు రద్దు చేయాలని కోరారు. వాటికి రాయితీతో కూడిన రుణాలు ఇవ్వాలని సూచించారు.
లాక్ డౌన్ కారణంగా ప్రభావితమైన 12 కోట్ల మంది వ్యవసాయ కూలీలు, రోజువారీ కార్మికులు, వీధి వ్యాపారులను ఆదుకోవాలని హర్దీప్ సింగ్ను గల్లా కోరారు. ఇందుకు 2.2 లక్షల కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా వివిధ సెస్సుల ద్వారా సేకరించిన 3.59 లక్షల కోట్లలో ఆ మేరకు కేటాయింపులు జరపాలని సూచించినట్లు గల్లా తెలిపారు.
ఇదీ చదవండి
అమరావతి మలిదశ ఉద్యమంపై ఎంపీ చర్చలు