స్థానిక సంస్థల నుంచి గుంటూరు జిల్లాలో ఇద్దరు శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కానున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లా నుంచి గతంలో స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అన్నం సతీష్ ప్రభాకర్ పదవీకాలం పూర్తికావడంతో ఖాళీలు ఏర్పడ్దాయి. వైకాపా తరఫున ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పూర్తికాలం పదవీలో కొనసాగగా, తెదేపా తరఫున ఎన్నికైన అన్నం సతీష్ ప్రభాకర్ 2019 సాధారణ ఎన్నికల తర్వాత జూన్ 4న రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంది.
అప్పట్లో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికకు ఓటర్లుగా ఉండే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉంటారు. ఇందులో మెజారిటీ స్థానాలు వైకాపాకు చెందినవారే ఉండటంతో ఇప్పుడు కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నవంబరు 16న ఎన్నికల ప్రకటన వెలువడుతుంది. డిసెంబరు పదో తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. డిసెంబరు 16 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిచేయాల్సి ఉంది. 862 మంది ఎంపీటీసీ సభ్యులు, 54 మంది జడ్పీటీసీ సభ్యులు, 273 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 57 మంది ఓటర్లుగా ఉన్నారు.
సామాజిక సమీకరణలు ప్రభావం చూపేనా?
జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలను ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, ఇటీవల వరకు ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మర్రి రాజశేఖర్ ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుండి నడిపించారు. 2019 ఎన్నికలకు ముందు సామాజిక, రాజకీయ సమీకరణాల్లో భాగంగా విడదల రజినికి చిలకలూరిపేట సీటు కేటాయించడంతో అవకాశాన్ని కోల్పోయారు. అప్పట్లో వైకాపా అధినేత వైఎస్ జగన్ చిలకలూరిపేట ఎన్నికల ప్రచారం సందర్భంగా మర్రి రాజశేఖర్‌కు అవకాశం ఇవ్వలేకపోయామని, విడదల రజనిని గెలిపిస్తే మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేగా విడదల రజిని విజయం సాధించడంతో మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తారని పలుమార్లు ప్రచారం జరిగింది.
ఎమ్మెల్యేలు, గవర్నరు కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక సమయంలో స్థానిక సంస్థల కోటా నుంచి అవకాశం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ఆపార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వైకాపా ఎన్నికల ప్రణాళిక, ఇతర అంశాల్లో కీలకంగా వ్యవహరించిన ఉమ్మారెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మార్గం సుగమమైందన్న చర్చ జరుగుతోంది. అయితే శాసనమండలిలో సామాజిక, రాజకీయ సమీకరణలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మార్పులు, చేర్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. సామాజిక సమీకరణల్లో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసురత్నంకు వచ్చే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: