మధ్యతరగతి ప్రజలు అందమైన, ఆనందమైన భవిష్యత్‌ను ఊహించుకుంటూ.. రూపాయి రూపాయి దాచుకుంటుంటారు. బ్యాంకుల్లో సొమ్ము జమ చేస్తే తక్కువ వడ్డీ వస్తుందని.. బంగారం మీద పెట్టుబడిపై నమ్మకం లేక కొందరు అధికాదాయ మార్గాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ సహా ఇతర వ్యాపారాలు చేసే అనేక మంది.. తమ ఇరుగుపొరుగు వారి దగ్గర నమ్మకంగా మెలుగుతుంటారు. ఊళ్లో ఉన్న పొలమో, ఇల్లో.. చాలామందికి అదొక్కటే ఆస్తిని చూపించి, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి కోట్లలో తీసుకుంటున్నారు. చివరకు చేతులెత్తేస్తున్నారు. కొందరు తమది కాని భూమినీ చూపించి వంచిస్తున్నారు. వారి వ్యవహారమంతా బయటపడ్డాక.. బాధితులందరూ తలపట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుంటూరు జిల్లా కొరిటెపాడులో ఇలాంటి మోసమే బయటపడింది.
రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తున్న వంచకులు..
మధ్యతరగతి ప్రజల్లో చాలామంది ఆశ్రయించే సులువైన పొదుపు మార్గం చిట్టీలు. ఇంట్లో వారికి తెలియకుండా దాచుకున్న డబ్బులు.. నమ్మకంగా మెలుగుతున్నవారి దగ్గర చిట్టీలుగా కడుతుంటారు. బ్యాంకు వడ్డీలతో పోలిస్తే ఎక్కువ వస్తుందని ఆలోచిస్తున్నారే తప్ప.. భద్రత గురించి పట్టించుకోవట్లేదు. అంతదాకా వారి మధ్య తిరిగిన వ్యక్తే చివరికి ప్లేటు ఫిరాయిస్తారు. బోర్డు తిప్పేస్తారు. అప్పుడు లబోదిబోమనడమే తప్ప బాధితులకు మరో దిక్కే కనిపించదు.
ఫిర్యాదుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువ..
గుంటూరు జిల్లా ఎస్పీ (GUNTUR SP) కార్యాలయానికి ప్రతి సోమవారం వచ్చే ఫిర్యాదుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉంటున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రజల స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అంటున్నారు. మోసపోయిన ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని.. డబ్బు ఇచ్చేటప్పుడు కచ్చితమైన ఆధారాలు ఉంచుకోవాలని న్యాయవాదులు సూచిస్తున్నారు. మరోవైపు.. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారి ఆస్తుల జప్తు ప్రక్రియను సులభతరం చేసి.. తమకు సాంత్వన కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీచదవండి:
NHRC: కొండపల్లి మైనింగ్‌పై వర్ల రామయ్య లేఖ.. విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం