Jinnah Tower Name changing issue : గుంటూరులోని జిన్నాటవర్ పేరు మార్చాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి.. జాతీయ నాయకుల పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టవర్ పేరు మార్చకుంటే.. కూలుస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్నేళ్లుగా నోరు మెదపని భాజపా నేతలు.. ఇప్పుడు జిన్నా టవర్‌పై మాట్లాడమేంటని.. వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరులో ముఖ్యమైన కూడలిగా.. వెలుగొందుతున్న కట్టడం జిన్నా టవర్. శాంతిచిహ్నంగా కుతుబ్‌మినార్ తరహాలో ఈ టవర్‌ను 1942లో నిర్మాణం చేపట్టి 1945లో పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మహ్మద్ అలీ జిన్నాను స్థానికులు ఆహ్వానించారు. అనివార్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. తన ప్రతినిధిగా జుదాలియాఖత్ అలీఖాన్‌ను పంపారు. అప్పటి నుంచి జిన్నా టవర్‌గా ఈ కట్టడానికి పేరొచ్చింది.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న జిన్నా టవర్ ఇప్పుడు వివాదాల్లో పడింది. నాడు దేశ విభజనకు కారణమైన జిన్నా పేరు దేశంలోని కట్టడాలకు ఉండరాదనే వాదనను భాజపా తెరపైకి తెచ్చింది. గుంటూరు నగర పాలక కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించింది. జిన్నా పేరును తొలగించి భారతావని ఉన్నతికి పాటుపడిన అబ్దుల్ కలాం, ప్రాణాలర్పించిన హమీద్, ప్రఖ్యాత సాహితీవేత్త గుర్రం జాషువా వంటి వారి పేర్లు పెట్టడం సముచితమన్నది భాజపా నేతల డిమాండ్.
" జిన్నా పేరును ఇంకా గుంటూరు సెంటర్ లో ఉంచడం భావ్యం కాదని భాజపా భావిస్తోంది. వెంటనే భారతావని ఉన్నతికి పాటుపడిన అబ్దుల్ కలాం, ప్రాణాలర్పించిన హమీద్, ప్రఖ్యాత సాహితీవేత్త గుర్రం జాషువా వంటి వారి పేర్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం " - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
" జిన్నా ఒక దేశ ద్రోహి..అటువంటి వ్యక్తి పేరు గుంటూరు లో ఓ సెంటర్ కు పెట్టడం ఆయన్ని ఇంకా గుర్తుపెట్టుకోవడం ఈ దేశ ప్రజలకు అవమానకరం. అబ్దుల్ కలాం, హమీద్,గుర్రం జాషువా వంటి మహనీయుల పేర్లు పెట్టడం సమంజసం." -సత్యకుమార్, భాజపా జాతీయ కార్యదర్శి
" దేశాన్ని రెండు ముక్కలు చేసిన జిన్నా పేరు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టారు..? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా..వెంటనే జిన్నా పేరును తొలగించాలని కోరుతున్నాను. " - రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే(తెలంగాణ)
జిన్నా టవర్‌పై భాజపా నేతల వ్యాఖ్యల్ని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. ఆ టవర్ స్వాతంత్య్రానికి పూర్వం నిర్మిస్తే.. ఇప్పుడెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్లుగా మాట్లాడని భాజపా నేతలు.. ఇప్పుడు జిన్నా టవర్ పేరు గురించి మాట్లాడటంలో వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు.
"ఇన్నాళ్లుగా మాట్లాడని భాజపా నేతలు ఇప్పుడు జిన్నా టవర్ పేరు గురించి మాట్లాడటంలో వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నాను. విజయవాడ సభలో సారాయి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇలా.. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. " - లేళ్ల అప్పిరెడ్డి, వైకాపా ఎమ్మెల్సీ
మొత్తానికి.. హఠాత్తుగా జిన్నా టవర్ పేరు మార్పుపై వివాదం చెలరేగడం గుంటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: