Aradhya Mother Suicide Attempt: గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మరణించిన చిన్నారి ఆరాధ్య తల్లి మోహన పావని ఆత్మహత్యాయత్నం చేసింది. నెల రోజులైనా తమ కుమార్తె మరణానికి కారణమేంటి, బాధ్యులెవరో తేల్చకపోవటం, కనీసం నివేదిక ఇవ్వకపోవటంతో పావని ఆవేదన చెందింది. ప్రభుత్వం, అధికారుల నిర్లిప్తత కారణంగానే తన భార్య పావని ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరాధ్య తండ్రి ఏడుకొండలు ఆరోపించారు.
అంకిరెడ్డిపాలెంకు చెందిన ఐదేళ్ల ఆరాధ్య కంటి కింద కణితి తొలగింపు కోసం గతనెలలో జీజీహెచ్‌లో చేర్పించారు. ఆరాధ్య పరిస్థితి విషమించటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మే 14న ఆరాధ్య మరణించింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. నెల రోజులు కావస్తున్నా..కనీసం నివేదిక ఇవ్వకపోవటంతో ఆరాధ్య తల్లి పావని ఆవేదన చెందిందని అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా భరోసా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పావనిని వెంటనే కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లిప్తత కారణంగానే తన భార్య పావని ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరాధ్య తండ్రి ఏడుకొండలు ఆరోపించారు. పావనికి కూడా ఆసుపత్రిలో సరైన చికిత్స ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడానికి డబ్బులు లేకే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని తెలిపారు. ఖాళీ కాగితాలపై సంతకం చేయమన్నారని, అప్పుడు తన కుమార్తె విషయంలో కూడా ఇలాగే సంతకాలు చేయించుకుని పొట్టన పెట్టుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
'డాక్టర్లు, ఎంక్వైరీ కమీషన్లు అందరూ వారికి అనుకూలంగా రిపోర్టు రాసుకున్నారు. వైద్యపరమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది...తగు చర్యలు తీసుకోండని అధికారులను బతిమాలాను. మంత్రి విడదల రజినీని కూడా కలిసి విన్నవించాం. ఎవ్వరూ ఈ విషయంలో ఎలాంటి హామీ మాకు ఇవ్వలేదు. పాప మరణానికి కారణమైన వారికి కాపాడుతున్నారు. నేనూ ఆత్మహత్య చేసుకుంటాను. మా పాప అసలు ఎలా చనిపోయిందో ఇంతవరకూ ఎవ్వరూ చెప్పడం లేదు. ఇప్పటికీ కారణం తెలియదు. ఒక్క అధికారికీ చలనం లేదు. రిపోర్టులన్నీ వారికి అనుకూలంగా రాసుకుంటున్నారు. నా భార్య, ఆరాధ్య తల్లి రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు కూడా సరైన వైద్యం అందిచడం లేదు. ఖాళీ కాగితాలు తెచ్చి సంతకం పెట్టమంటున్నారు. మా పాప చికిత్స అప్పుడు కూడా ఇలాగే చేశారు.' - ఏడుకొండలు, ఆరాధ్య తండ్రి
ఆరాధ్య పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదు కాబట్టే విచారణ ఆలస్యమైందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పావని పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు.
'చిన్నారి ఆరాధ్య చనిపోయినపుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పోస్టుమార్టానికి పంపాము. అయితే పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు.రిపోర్టు ఆఖరి అభిప్రాయం పెండింగ్‌లో ఉంది.దాంట్లో కొన్నింటిని వేరే డిపార్టుమెంట్లకు పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు వచ్చాక చివరి అభిప్రాయం ఇస్తారు. అందుకోసం కనీసం వారు 15 రోజుల నుంచి నెలపాటు సమయం తీసుకుంటారు. వారిచ్చే ఆఖరి అభిప్రాయం కోసమే వేచి చూస్తున్నాం. రిపోర్టు ఆధారంగా అందకు తగిన విధంగా ముందుకు వెళ్తాం.' - సీతారామయ్య డీఎస్పీ, గుంటూరు
ఇవీ చదవండి :