ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ విడుదల చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి ఆనందాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో విశాఖ విద్యార్థి వావిలపల్లి సాయినాథ్ సత్తా చాటాడు. ఎంసెట్లో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్‌లో సాయినాథ్ మంచి ర్యాంకులు సాధించారు. తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సహకారంతో ఈ విజయం సాధ్యమైందని సాయినాథ్ చెబుతున్నారు. సాయినాథ్ ఎంసెట్ మొదటి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ లో వైద్య విద్య చేయాలని లక్ష్యం
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చైతన్య సింధు...ఎంసెట్ మెడిసిన్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. చైతన్య సింధు తండ్రి కోటేశ్వరప్రసాద్, తల్లి సుధారాణి వైద్యులే కావటం విశేషం. చిన్నప్పటి నుంచి చైతన్య సింధు చదువులో మంచి ప్రతిభ కనబరిచేదని తల్లిదండ్రులు తెలిపారు. ఎంసెట్ ఫలితాల్లో 160 మార్కులకు గాను 152.5 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు వైద్యులు కావటంతో చిన్నప్పటి నుంచి ఆ రంగంపై ఆసక్తి ఉన్నట్లు సింధు తెలిపారు. నీట్లో 720కి గాను 715 మార్కులు వచ్చాయని... ఆ ఫలితాల్లోనూ మంచి ర్యాంకు వస్తుందని సింధు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసించాలనేది తన లక్ష్యమని తెలిపారు.
న్యూరాలజిస్ట్ అవడమే లక్ష్యం
న్యూరాలజీ వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకుని ఉందని, ఆ విభాగంలో వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలు చేస్తానంటున్నారు. ఏపీ ఎంసెట్ వ్యవసాయ, ఫార్మశీలో రెండో ర్యాంక్ సాధించారు త్రిపురనేని లక్ష్మీసాయిమారుతీ. రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎయిమ్స్‌లో న్యూరాలజీ వైద్యురాలు కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రెండో ర్యాంకు వచ్చిందన్నారు. సాయిమారుతీకి మంచి ర్యాంకు రావడం పట్ల తల్లదండ్రులతో పాటు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
వైద్యుడిగా రాణిస్తాను
రెండున్నర సంవత్సరాల కష్టానికి ఫలితమే రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకని ఎంసెట్ ర్యాంకర్ మనోజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర మూడో ర్యాంకు సాధించిన మనోజ్ కుమార్‌ని తిరుపతిలో అతను చదువుకున్న కళాశాల యాజమాన్యం సత్కరించింది. తమ కుమారుడి విజయం పట్ల తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్ కుమార్...రెండున్నర సంవత్సరాల పాటు ప్రణాళిక బద్ధంగా చదవటమే తన విజయానికి కారణమన్నారు. మెడిసిన్ పూర్తి చేసి మంచి వైద్యుడిగా రాణించాలన్నదే తన లక్ష్యంగా తెలిపారు.
పేదలకు సేవ చేస్తాను
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల సహకారంతో ఎంసెట్లో ఏడో ర్యాంకు సాధించానని లికిత అన్నారు. కడప ప్రకాష్ నగర్‌కు చెందిన వేణుగోపాల్ రెడ్డి, సుజాత ఇద్దరు ఉపాధ్యాయులు. వారి కుమార్తె ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. వైద్యురాలిగా ప్రజల సేవలందిస్తానని లిఖిత తెలిపారు.
పేదలకు వైద్య సేవలు అందిస్తాను
ఎంసెట్ ఫలితాల్లో కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడుకు చెందిన జడ వెంకట వినయ్ కుమార్ ఎంసెట్ వైద్యవిభాగంలో 8వ ర్యాంకు సాధించారు. వినయ్ తల్లిదండ్రులు జడ శ్రీనివాసులు, నాగసూర్య. ఎంసెట్లో స్టేట్ 8వ ర్యాంకు సాధించడం పట్ల వినయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నీట్లో కూడా ర్యాంకు సాధిస్తానని వినయ్ ఆశాభావం వ్యక్త చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈ ర్యాంకు సాధించానని వినయ్ అంటున్నారు. మెడిసిన్ పూర్తి చేసి వైద్యుడు అయ్యి ప్రజలకు సేవ చేస్తానని వినయ్ తెలిపారు.
కార్డియాలజిస్ట్ అవుతా
కర్నూలు నగరానికి చెందిన నితిన్ వర్మ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో రాష్ట్ర స్థాయి 9వ ర్యాంకు సాధించారు. నితిన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివారు. కార్డియాలజి వైద్యుడిగా సేవలందించడమే తన లక్ష్యమని నితిన్ అన్నారు. నితిన్ వర్మ తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మలతలు. సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నితిన్ వర్మ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడని పదవ తరగతిలో 10/10 సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు.
రోజుకు 10 గంటల ప్రిపరేషన్
వైద్యుడు కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ఎంసెట్ ఓపెన్ కేటగిరిలో 10వ ర్యాంకు సాధించానని గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన రేవంత్ తెలిపారు. తన కృషికి తోడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం తోడై ర్యాంకు సాధించినట్లు చెప్పారు. రోజుకు 10 గంటలపాటు చదివేవాడినని... బయాలజీ, ఫిజిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించినట్లు రేవంత్ చెప్పారు. నీట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు రేవంత్ చెప్పారు. రేవంత్ తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి లక్ష్మీప్రసన్న బాలకుటీర్ పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.
జేఈఈలో అడ్వాన్స్‌లోనూ ప్రతిభ
ఎంసెట్ ఫలితాలు అనంతపురానికి చెందిన ఎండి చక్రధర్ 13వ ర్యాంకు సాధించారు. చక్రధర్ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివారు. తండ్రి నాగభూషణం అనంతపురం జేఎన్టీయూలో సూపరిండింటెండ్, తల్లి నాగమణి హెచ్ఎల్సీ కార్యాలయంలో ఉద్యోగిని. జేఈఈ అడ్వాన్స్‌లో 650 మార్కులు సాధించినట్లు చక్రధర్ తెలిపారు. ఎంసెట్లో 13వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చక్రధర్ మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
మూగజీవాలకు వైద్యం చేస్తా
ఎంసెట్ పశు వైద్య విభాగంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన నేతింటి జ్యోతి కృష్ణ 75వ ర్యాంకు సాధించారు. పశువైద్య కోర్సు పూర్తిచేసి మూగజీవాలకు ఆసరాగా ఉంటానని జ్యోతి కృష్ణ అన్నారు. జ్యోతి కృష్ణ తండ్రి లక్ష్మణరావు రైతు, తల్లి భీష్మమణి గృహిణి.
ఇదీ చదవండి: