సంతానం లేని దంపతుల చిరకాల కోరికను తీర్చడానికి.. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన దత్తత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటు ఉండకూడదనే ఉద్దేశంతో.. స్త్రీ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించింది. గుంటూరు సర్వజనాసుపత్రిలోని దిశ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దత్తతు కేంద్రాన్ని, ఉయ్యాలను.. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. పిల్లలు లేని తల్లిదండ్రులు.. చట్ట ప్రకారం దత్తతు తీసుకోవచ్చని తెలిపారు.
పుట్టిన సంతానాన్ని కొంతమంది చెత్తకుప్పలు, మురుగు కాల్వలు, ముళ్ల పొదల్లో పడేస్తున్నారన్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తులు పిల్లలను రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో వదిలితే.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వం తరపున అండగా నిలిచి కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'బాలల్లో స్ఫూర్తి నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమం'