ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక... సేవ్ అమరావతి అనే నినాదాలతో గుంటూరులో 10కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటుడు సుమన్, జబర్దస్త్ సభ్యులు హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 10కే రన్ కార్యక్రమాన్ని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
గుంటూరు విద్యానగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నుంచి లాడ్జి సెంటర్, శంకర్ విలాస్ కూడలి మీదగా సాగిన 10కే రన్లో మహిళలు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 ఏళ్లుగా గుంటూరులో 10కే రన్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభినందించారు. ఈ సంవత్సరం సేవ్ అమరావతి అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నడక వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని సినీనటుడు సుమన్, జబర్దస్త్ టీం సభ్యుడు హైపర్ అది అన్నారు.