Year of elusive disease in Eluru : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరును ఏడాది కిందట అంతుచిక్కని వ్యాధి వణికించింది. గతేడాది డిసెంబరు 5 నుంచి 14 వరకు మూర్ఛ లక్షణాలతో 615 మంది ఆసుపత్రుల్లో చేరారు. వైద్యుల చికిత్సతో కోలుకున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటివరకు మళ్లీ రాలేదు. తద్వారా అధికారులు నీటి నమూనాల సేకరణ, పరీక్షలకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి అనంతరం వేర్వేరు రోజుల్లో కొమిరేపల్లి (దెందులూరు మండలం) లో 25, పూళ్ల (భీమడోలు మండలం)లో 30 చొప్పున అంతుచిక్కని వ్యాధి మాదిరిగానే కేసులు బయటపడ్డాయి. అయితే ఈ కేసులకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.
గోదావరి నుంచి స్థానికులకు సరఫరా చేసే నీరు కలుషితం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతుచిక్కని వ్యాధి కేసులు రావడానికి వారం ముందు నుంచి నీళ్లు పచ్చగా వచ్చేవని, వాసన కూడా వచ్చిందని పలువురు తెలిపారు. ఇదే సమయంలో తాగునీటి కలుషితంతోనే కేసులు వచ్చాయని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్) తన అధ్యయనంలో తేల్చడం గమనార్హం. నాటి ఘటన తర్వాత ఏలూరులో తాగునీటి నమూనాలను పరీక్షించేందుకు రూ.6.5 కోట్లతో అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు పరికరాలు వచ్చాయి.
నమూనాల సేకరణ... విశ్లేషణ
Year of elusive disease in Eluru : బాధితుల అస్వస్థతకు కారణాల అన్వేషణకు అప్పటి నుంచి పరిశోధనలు సాగుతున్నాయి. అప్పట్లో ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల బృందం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నాడు చికిత్స పొందుతున్న, కోలుకున్న వారిలోని 90 మంది నుంచి రక్త, 51 మంది నుంచి మూత్ర నమూనాలను తీసుకుంది. ఫలితాలు విశ్లేషించగా వాటిలో ట్రైజోఫాస్(ఆర్గానోఫాస్పరస్) ఆనవాళ్లు కనిపించాయి. బాధితుల ఇళ్లలోని కూరగాయలు, వండిన ఆహారం నమూనాల్లోనూ మెట్రిబుజిన్(కలుపు నివారణ) అవశేషాలూ కనిపించాయి.
Year of elusive disease in Eluru : ఈ ఎన్‌ఐఎన్ అధ్యయన వ్యాసం అంతర్జాతీయ జర్నల్ (ప్లాస్ వన్)లో ఈ ఏడాది నవంబరు 6న ప్రచురితమైంది. ప్రధాన ట్యాంకుల నుంచి ఇళ్లకు నీటిని సరఫరా చేసే పైపుల్లో మధ్యలో ఎక్కడో నీరు కలుషితమై ఉంటుందని, వాటి నుంచి సేకరించిన నమూనాలలో ట్రైజోఫాస్ అవశేషాలు కనిపించినట్లు ఎన్‌ఐఎన్ పేర్కొంది. అయితే... ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా అవుతున్న తాగునీరు పచ్చగా ఉంటోందని, వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రైతులు పంటల రక్షణకు, కీటకాల నిర్మూలనకు ఆర్గానోఫాస్ఫరస్ విభాగానికి చెందిన పురుగుమందుల్ని వినియోగిస్తున్నారు. ఈ విభాగంలోని ట్రైజోఫాస్ మందు వాడకంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నట్లు అంచనా.
నిరంతరం నమూనాల పరీక్షలు...
ఏలూరు ఘటనపై ఇప్పటివరకు 18 సంస్థలు అధ్యయనం చేశాయి. బాధిత ప్రాంతాల్లో నీరు, కూరగాయల నమూనాలను నిరంతరం పరీక్షిస్తున్నాం. ఇప్పటివరకు అనుమానించేలా నివేదికలు రాలేదు. బాధితుల్లో ఆర్గానోఫాస్పరస్ అవశేషాలు ఎలా చేరాయన్న దానిపై స్పష్టత రాలేదు.
-కార్తికేయమిశ్ర, కలెక్టర్, పశ్చిమగోదావరి
ఇటీవల కొత్త కేసులేమీ రాలేదు...
బాధితులపై ట్రైజోఫాస్ ప్రభావమే కనిపించింది. జనవరి వరకు నమోదైన కేసుల్లో కళ్లు తిరిగి స్పృహ తప్పిపడిపోవడం, కాళ్లు, చేతులు కొట్టుకోవడం, కండరాల పట్టివేతలాంటి లక్షణాలు కనిపించాయి. ఇటీవల కొత్త కేసులు రాలేదు.
-డాక్టర్ మోహనరావు, సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, ఏలూరు
ఇవీచదవండి.