పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటి వరకు అరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా మూర్ఛ, వాంతులు, కళ్లుతిరగం, నోటి నుంచి నురగరావడం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఒకరి తరువాత ఒకరు కింద పడిపోతున్నారు. రాత్రి అయ్యే సరికి అనేక కాలనీల్లోనూ ఇదే పరిస్థితి. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా 60 నుంచి 80 మంది వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారని సమాచారం. ఆదివారం మధ్యాహ్నం సమయానికి మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 300పైగా ఉంది.
ప్రభావిత ప్రాంతాలు
నగరంలోని దక్షణవీధి, పడమరవీధి, తాపీమెస్త్రీవీధి, తంగళ్లమూడి, అశోక్ నగర్, కొత్తపేట, అరుంధతిపేట, కొబ్బరితోట వీధి, వంగాయగూడెం, ఆదివారపుపేట ప్రాంతాల నుంచి అధికంగా అస్వస్థతకు గురయ్యారు.
అంతు చిక్కని వ్యాధి
ఏలూరులో ప్రజలు ఆస్వస్థతకు గురై 24గంటలు గడుస్తున్నా.. కారణాలు మాత్రం నిర్ధారణ కాలేదు. శనివారం రాత్రి నుంచి బాధితులకు అన్ని పరీక్షలు నిర్వహించారు. బాధితుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు బయటపడలేదని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన వారందరికీ కొవిడ్ పరీక్షల్లోనూ నెగిటివ్‌గా తేలిందని వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.
ప్రాణాపాయం లేదు
శనివారం రాత్రి నుంచి బాధితులకు జరిపిన పరీక్షల్లో ఎలాంటి వ్యాధి నిర్ధరణ కాలేదు. వైరల్, బ్యాక్టీరియా వంటి పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలింది. కొవిడ్ పరీక్షల్లోనూ నెగెటివ్ వచ్చింది. నగరంలో 22 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షించాం. ఎలాంటి కలుషిత లక్షణాలు కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించాం. మిగతా వారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. కొందరు భయంతో ఆసుపత్రికి వస్తున్నారు- ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
బాధితులు ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ శిబిరాలు నిర్వహిస్తోంది. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి