పశ్చిమ గోదావరి జిల్లాలో కవలల కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది. కిడ్నాపర్ చెర నుంచి పోలీసులు కవలలను కాపాడారు. కానీ కిడ్నాప్ కథకు అసలు సూత్రధారి ఎవరో తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. ఆ వివరాలు...
అసలేం జరిగింది..?
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రకు చెందిన కవలలు రామ్‌పవన్ కుమార్, లక్ష్మణ్ కుమార్. వీరి వయసు 13సంవత్సరాలు. నిన్న బయటకు కలిసి వెళ్లిన వీరిద్దరూ..రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. వారే వస్తారని ఎదురుచూస్తున్నా...ఎంత సేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలయ్యింది. కంగారు పడుతూనే ఊరంతా వెతికారు. కనిపించిన వారందరినీ అడిగారు. పిల్లలిద్దరూ కనిపించకపోవడంతో కంగారు పడిన వారు పోలీసు స్టేషన్‌కు పరిగెత్తారు. తమ కుమారులు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మీకు ఎవరైనా శత్రవులు ఉన్నారా..??ఎవరిపైనైనా అనుమానాలున్నాయా? అని వారిని ప్రశ్నించారు. ఓవైపు ఆ దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతూ...వారి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి రాజేశ్ అని తెలుసుకున్నారు. అయితే ఇంతలో రాజేశ్ కవల సోదరుల్ని వదిలాలంటే రూ.15 లక్షలు తనకు ఇవ్వాలని తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు కిడ్నాపర్ రాజేశ్‌ను రాజమహేంద్రవరంలోని ఓ లాడ్జిలో అరెస్టు చేశారు. రాజేశ్ నుంచి ఇద్దరు కవల బాలుర్లను విడిపించారు.
కొసమెరుపు...
రాజేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విచారించగా నిజం తెలుసుకుని నివ్వెరపోయారు. కవలల కిడ్నాప్ కథకు పిల్లల తల్లే అసలు సూత్రధారని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి :COUPLE DEATH: కార్తిక దీపం వదిలేందుకు వెళ్లి భార్య.. ఆమెను కాపాడేందుకు వెళ్లి భర్త..!