ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గ్రామంలోని వైకాపాలో ఇరువర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే గంజి ప్రసాద్ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపిస్తోంది.
అందువల్లే ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు సమాచారం. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను.. పార్టీలోని ఓ వర్గం అడ్డుకుంది. కొందరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు. అయినా.. కొందరు వైకాపా నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసులు ఆయనను ఉంచిన చోట ఆందోళనకు దిగారు. దీంతో.. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఇదీ చదవండి: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు