వర్షాలతో రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. రైతాంగం రెట్టించిన ఉత్సాహంతో.. సాగు పనుల్లో నిమగ్నమైంది.
ఏలూరులోరోడ్లపైకి మురుగు నీరు
నైరుతి వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ప్రకాశం జిల్లా ఏలూరులో సుమారు 2గంటలపాటు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీళ్లు నిలిచిన రహదారులపై వాహనాల రాకపోక కష్టమైంది. పోలీస్ క్వార్టర్స్, నగరపాలక సంస్థ కార్యాలయాల్లోకి వర్షపునీరు చేరి ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. అస్తవ్యస్త మురుగునీటి పారుదలవ్యవస్థ మరోసారి రుజువైంది. రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఈ పరిస్థితి మార్పు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
చల్లబడిన ఉంగుటూరు, గుడివాడ, అవనిగడ్డ
కృష్ణా జిల్లా ఉంగుటూరు, గుడివాడలో వర్షం పడి వాతావరణం చల్లబడింది. పెద్దఅవుటపల్లిలో కురిసిన కుండపోత వర్షానికి... వీధులు చెరువులను తలపించాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకే ఈ దుస్థితి వచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
గుంటూరు వ్యాప్తంగా జోరువానలు
గుంటూరు జిల్లాలోని 22 మండలాల్లో సగటున 2.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్ఠంగా వెల్దుర్తిలో, కనిష్ఠంగా సత్తెనపల్లిలో వానపడింది. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వర్షానికి చీరాల రహదారులు చిత్తడిగా మారాయి. ఇప్పటికే ఖరీఫ్ ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులు... వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.