Nadendla Manohar : ప్రజల సంక్షేమం కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో పర్యటించిన ఆయన.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త దాకవరపు కొండలు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యకర్తలకు.. పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కృష్ణాజిల్లా చల్లపల్లిలో జనసేన కార్యకర్త కుటుంబానికి 5లక్షల చెక్కును పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అందించారు. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన దొరబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత పవన్ కల్యాణ్దేనని కొనియాడారు.
ఈ సందర్బంగా వైకాపాపై నాదెండ్ల మనోహర్ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దాడుల కోసం వినియోగించే సమయాన్ని ప్రజల కోసం ఆలోచిస్తే ఎంతో బాగుంటుందని సూచించారు.
వైకాపా ప్రజాప్రతినిధులు విలువలు కోల్పోయి.. అనైతిక భాష మాట్లాడుతున్నారు. రాజకీయ దాడుల కోసం వెచ్చించే సమయాన్ని ప్రజల బాగోగుల కోసం వినియోగించాలి. మహాత్మా గాంధీ తిరిగిన గుడివాడను.. బూతుల వాడగా మార్చారు. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని అనవసర మాటలు మాట్లాడడం మాని.. స్థానిక ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాలి. సంక్షేమం పేరుతో వైకాపా ప్రభుత్వం గోబల్స్ ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 3వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. -నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
ఈ కార్యక్రమంలో కృష్ణా, ఏలూరు జిల్లాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: